ముద్ర ప్రతినిధి, నిర్మల్:
విద్యార్థుల సామర్థ్యాల పెంపుదల లక్ష్యంగా విద్యాబోధన చేయాలని కలెక్టర్ అభిలాష అన్నారు. సారంగాపూర్ మండలం చించోలి బి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారితో మాట్లాడుతూ మెనూ ప్రకారం అందిస్తున్నారో లేదో తెలుసు కున్నారు. క్రమం తప్పకుండా బడికి రావాలని అన్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అన్ని శ్రద్ధగా వినాలన్నారు. మధ్యాహ్నం వేళల్లో ఎండ అధికంగా ఉన్నందున విద్యార్థులు బయట తిరగకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. భోజనశాల లేదన్న విషయం విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన కలెక్టర్ భోజనశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్రతిరోజు విద్యార్థులందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. పిల్లలకు ఎటువంటి సమస్యలు కలగకుండా చూసుకోవాలని వివరించారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచు కోవాలన్నారు. ఆమె వెంట డీఈవో భోజన్న, తహసిల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మికాంత రావు, సర్పంచ్ సాయన్న, పంచాయితీ కార్యదర్శి సౌజన్య, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.