- ప్రజావాణిలో 70 దరఖాస్తుల స్వీకరణ
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు అందజేసిన అర్జీలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీతలతో కలసి స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
- రెవెన్యూ శాఖ –36, ఇతర శాఖలకు – 34 , మొత్తం 70 దరఖస్తులు అందాయి.
అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే ఇంటర్మీడియట్ మరియు పదవ తరగతి పరీక్షలల్లో విద్యార్థులు ఈవిద్యా సంవత్సరంలో 100/100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని విద్యాశాఖ అధికారికి సూచించారు. పదవ తరగతిలో సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ఆయా సబ్జెక్టులలో ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల/కళాశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి ఏర్పకుండా చర్యలు చేపట్టాలని, మరమ్మత్తులు ఏమైన ఉంటే వెంటనే చేపట్టి నీటి ఎద్దడిని నివారించాలని తెలిపారు. వేసవి కాలంలో నీటి సరఫరా సమస్యలు గుర్తించి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో మండల మున్సిపల్ పరిధిలో మరమ్మత్తులు ఉంటే చేయించి నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో మండల మున్సిపల్ పరిధిలో అధికారులు సమన్వయంతో పనిచేసే రాబోయే వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక బద్ధంగా పని చేయాలని సూచించారు. ముఖ్యంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆయా గ్రామాలు నీటి సరఫరా అధికారులు సందర్శించి అందుకు కావలసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
