ఎన్నికల సిబ్బంది విధులకు ఆటంకం
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలపై చర్యలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఈ నెల 11న మున్సిపల్ పోలింగ్ లో ఎన్నికల విధులు నిర్వర్తిసోన్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై ఆ శాఖ చర్యలు తీసుకున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వారిద్దరిపై గురువారం కేసులు నమోదు చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకోవడమే కాకుండా, వారి విధులకు తీవ్ర ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు బీఎస్ఎస్ యాక్ట్ 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 34వ వార్డులోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగిన జగ్గారెడ్డి . అక్కడి సీఐ, కాంగ్రెస్ అభ్యర్థి పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బందిని, పోలీసులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని అధికారులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం నివేదికను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు, ప్రభుత్వ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసినందుకు ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సంగారెడ్డి పోలీసులు బీఎన్ఎస్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిజామాబాద్ ఎంపీపైనా మూడు సెక్షన్లు…
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హరిచరణ్ మార్వాడీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనను ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. పోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై గుర్రం నారాయణ, హెడ్ కానిస్టేబుల్ గోవర్ధన్, శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను, పోలింగ్ సిబ్బందిని పరుష పదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కెమెరాలతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 132, 223, 296(బి) కింద కేసులు నమోదు చేశారు. అదనంగా తెలంగాణ మున్సిపాలిటీ చట్టం–2019లోని సెక్షన్ 226 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని, అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.