అమరావతిలో దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభం విశ్వ క్వాంటం దినోత్సవం సందర్భంగా చరిత్రాత్మక ఘట్టం
అమరావతి:
ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ (AQRF)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం క్వాంటం సాంకేతిక రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు.
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ‘1S’ పేరిట ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీని, మేధా టవర్స్‌లో ‘1Q’ పేరిట మరో క్వాంటం సిస్టంను ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఈ ఫెసిలిటీలు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, పరిశ్రమలకు అందుబాటులో ఉండటం వల్ల పరిశోధనలకు మరియు ఆవిష్కరణలకు ఊతమిస్తాయని తెలిపారు.
క్వాంటం సైన్స్‌కు వందేళ్లు పూర్తైన సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించడం మరింత విశిష్టతను సంతరించుకుందని అన్నారు. విజ్ఞానమే సామాజిక ప్రగతికి మార్గదర్శకమని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన మాటలను స్మరించుకుంటూ, ఆయన జయంతి రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు.
అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కార్యదర్శి అభయ్ కరాండికర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్‌బెడ్స్ ద్వారా క్వాంటం పరికరాలను పరీక్షించడం, ధృవీకరించడం సులభమవుతుందని, భారతీయ పరిశోధకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు. ఐటీ రంగంలో ముందంజలో ఉన్న తెలుగు రాష్ట్రం ఇప్పుడు క్వాంటం టెక్నాలజీలో కూడా ముందుకు రావడం గర్వకారణమన్నారు.
పారిశ్రామిక రంగానికి విద్యుత్ ఎంత ముఖ్యమో, డిజిటల్ యుగానికి ఇంటర్నెట్ ఎంత అవసరమో, భవిష్యత్తు ఆవిష్కరణలకు క్వాంటం టెక్నాలజీ అంతే కీలకమని ఆయన స్పష్టం చేశారు. క్వాంటం సాంకేతికతలో ఆధిపత్యం సాధించిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని అభిప్రాయపడ్డారు.
కేవలం ఎనిమిది నెలల్లోనే ఈ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చడం విశేషమని, ఇది దేశ సాంకేతిక సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.