ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో శనివారం వటపత్రశాయి అలంకార సేవలో నారసింహుడు భక్తుల దర్శనార్ధం తిరువీధులలో ఊరేగాడు. ఆలయ ప్రధానార్చకులు పత్ర సాయి అలంకార విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ వేడుకలలో ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, అర్చక బృందం, పారాయణీకులు కార్యనిర్వహణాధికారి జె.భవానీశంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహామూర్తి, జిల్లా కలెక్టరు యం. హనుమంతరావు, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణీభరత్ గౌడ్, ఉపకార్యనిర్వహణాధికారి, సహాయకార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
వటపత్రశాయి అలంకార శేవ విశిష్టత

భగవానుడి సృష్టి ప్రారంభ దశలో సమస్త విశ్వములు బ్రహ్మాండములు అన్ని లోకములు జలములతో నిండి ఉండగా ఆ జలములపై భగవానుడు ఒక మఱి ఆకుపై అరవిందము వంటి చేతితో పవళించి తన లీలా విలాసమును ప్రకటించుచూ పదారవిందములను ముఖారవిందంలో నిలుపుదల చేసి తన కడుపులో గల 14 లోకములకు సమస్త ప్రాణములకు ప్రకృతికి అమృతమును అందించి వాటిని సంరక్షించిన తీరు ఈ వటపత్ర శాయి అలంకారంలో దర్శించవచ్చును.
సాయంకాల కార్యక్రమాలు
శనివారం సాయంకాలం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం రాత్రి శ్రీస్వామివారిని “హంసవాహనశేవ” లో అలంకరించి తిరుమాఢవీధులలో ఊరేగింపు శేవ నిర్వహించారు. ఈ వేడుకను ఆలయప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేద పండితులు, అర్చక బృందం, పారాయణికులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ అధికారులు ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హంసవాహనశేవ ప్రత్యేకత
భగవానుడి అనేక అవతారములలో పేరు ఎన్నిక గన్నది హంసావతారం. హంస జ్ఞానానికి ప్రతీక. బ్రహ్మదేవుడికి వేదములను ఉపదేశం చేసి భగవానుడు తన దివ్య అనుగ్రహమును హంస రూపంలో అనుగ్రహించిన తీరు ఈ అవతారంలోని ప్రత్యేకత. హంస నీటిని పాలను ఎలా వేరు చేసి చూపగలదో అలాగే భగవానుడు ఉపదేశం కూడా మనలో మంచిని పెంచి ధార్మికతలో మనల్ని నడిపించి మనలోని అజ్ఞానము తొలగించి జ్ఞానమును కలిగించే వైనం ఈ సేవలో దర్శించచ్చును.