ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
పాలమూరు విద్యార్థులు కోహినూరు వజ్రం లాంటి వారని , ఇక్కడి గ్రామీణ వెనుకబడిన వర్గాల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మహబూబ్‌నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 30 రోజుల పాటు మెరిట్ స్కాలర్ షిప్ కోసం రెసిడెన్షియల్ స్థాయిలో అందించిన ప్రత్యేక శిక్షణ పొంది, మెరిట్ స్కాలర్ షిప్ సాధించిన విద్యార్థులకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు సరైన వాతావరణం, ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం ఉంటే ఉన్నత లక్ష్యాలను సాధిస్తారన్నారు. ప్రస్తుతం ఎంపికైన 80 మంది విద్యార్థుల్లోనే భవిష్యత్ దేశ నిర్మాతలు కనిపిస్తున్నారని తెలిపారు. ఈ విద్యార్థులు సాధారణ కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ, వారి ప్రతిభ అసాధారణమన్నారు. వీరిని కంటికి రెప్పలా కాపాడుతూ, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం సమాజ బాధ్యతగా భావించాలన్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు సహా అనేక మంది మద్దతు ఇవ్వనున్నారని, ప్రస్తుతం ఈ విజయాలు పెద్దగా ప్రచారం కాకపోయినా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. మహబూబ్‌నగర్‌కు పెద్దగా భౌతిక సంపదలు లేకపోయినా, పిల్లల తెలివితేటలే అసలు సంపద అని పేర్కొంటూ, ప్రతి ఇంట్లో ఒక “కోహినూర్ వజ్రం” ఉందని, ఆ ప్రతిభకు సాన పెట్టితే అద్భుతాలు సాధ్యమని తెలిపారు. విద్యార్థి జీవితంలో 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న ఐదేళ్లు అత్యంత కీలకమని, ఈ దశలో క్రమశిక్షణ, మార్గనిర్దేశం కల్పిస్తే వారు అద్భుత ఫలితాలు సాధిస్తారని వివరించారు. మహబూబ్‌నగర్ ఫస్ట్ ఏర్పాటు చేసిన క్యాంపు ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, పోటీ భావన, ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నాయని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులకు సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన కోచింగ్ ద్వారా 116 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ వంటి కోర్సుల్లో ఉచిత సీట్లు సాధించారని గుర్తుచేశారు. విద్యార్థులకు అందిస్తున్న రీజనింగ్, ఇంగ్లీష్ శిక్షణ భవిష్యత్తులో అన్ని పోటీ పరీక్షలకు బలమైన పునాది అవుతుందని తెలిపారు. పిల్లల్లో “మేము కూడా సాధించగలం” అనే నమ్మకాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఉంచి, తమ పిల్లలలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ, వారి భవిష్యత్తును బలపరుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, వందేమాతరం ఫౌండేషన్ రవీందర్, ఎఎంఓ శ్రీనివాస్, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, శ్రీ లలితాంబికా దేవి ఆలయ అధ్యక్షులు గుముడవెళ్ళి భాస్కర్, రామకృష్ణ మఠం రాజ మల్లేష్, పిఆర్టీయు సంఘం అధ్యక్షులు మధన్ మోహన్ యాదవ్, కార్పొరేటర్ లు ఎంపి ప్రవీణ్ కుమార్, ఎస్. శేఖర్, ప్రశాంత్ , ఎంఇఓలు, ప్రధానోపాధ్యాయులు , వందేమాతరం కో ఆర్డినేటర్ రవీందర్ రెడ్డి,సోంభూపాల్ రెడ్డి, నాయకులు అజ్మత్ అలీ,విద్యా వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post