Take a fresh look at your lifestyle.

వైద్యాధికారుల పనితీరు మెరుగుపడాలి.

 

వైద్య సిబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలి

బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు తప్పనిసరి చేయాలి

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరగాలి

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యాధికారులు, సిబ్బంది తమ పనితీరును మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శనివారం ఐడిఓసి సమావేశపు మందిరంలో నిర్వహించిన వైద్య, ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తాను ఇటీవల జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు వివిధ సమస్యలను గుర్తించానన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పాత ఫైల్స్ క్లియరెన్స్, పనికిరాని ఫర్నిచర్ తొలగించాలని ఆదేశించినప్పటికీ చాలాచోట్ల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత మెడికల్ అధికారులు బాధ్యతాయుతంగా లేకుంటే తమ కిందిస్థాయి సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారన్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, లీవ్ లెటర్ రాయకుండా విధులకు గైర్హాజరైతే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పీహెచ్ సీలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రిల్లో బయోమెట్రిక్ విధానంలో హాజరు తప్పనిసరి చేయాలని, యంత్రాల్లో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకుని వినియోగించాలన్నారు. ఆయా ఆసుపత్రుల్లోని వివిధ రిజిస్టర్ల నిర్వహణ, వ్యాక్సినేషన్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆయా ఆసపత్రుల వైద్యాధికారులు తమ సమీపంలోని సబ్ సెంటర్స్ కు, ఇతర క్యాంపులకు వెళ్లినప్పుడు ముందుగానే సంబంధిత రిజిస్టర్లో పేర్కొన్నాలన్నారు. ఎన్సిడి స్క్రీనింగ్ తో పాటు ఇతర కార్యక్రమాలన్నీ వంద శాతం విజయవంతం చేసేలా పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగాల్సి ఉందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వైద్య సేవలకు చాలామంది రోగులు కర్నూలుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలోనే మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఏరియా ఆసుపత్రులతో పాటు సబ్ సెంటర్స్ సాయి వరకు ప్రతి 15 రోజులకోసారి వైద్యాధికారులు తమ సిబ్బందితో సమన్వయ సమావేశాలు నిర్వహించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. వైద్యాధికారులు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల ఆరవ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల గురించి డిఎంహెచ్వో సంధ్య కిరణ్మయి తెలియజేశారు.

ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని వైద్య కేంద్రాల డాక్టర్లు, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.