– దశబ్దాలుగా సా..గుతున్న పనులు.. ఎక్కడికక్కడే పెండింగ్ లో కాలువల పనులు
– కాలువల నిర్మాణానికి ఇంకా సేకరించని భూములు… భూసేకరణ పనుల్లో తీవ్ర జాప్యం
– నలుగురు ముఖ్య మంత్రులు మారినా ముందుకు సాగని లిఫ్ట్ పనులు
– నెట్టెంపాడు లిఫ్ట్ కింద రెండు జాలాశయాల నిర్మాణం పూర్తయినా లీకేజి లతో సతమతం
– పదేళ్ల బీ ఆర్ ఎస్ పాలనలో ఈ లిఫ్ట్ వైపు కన్నెత్తి చూడని అప్పటి సీఎం కెసిఆర్
– 2 లక్షల ఎకరాలకు నీరందించే ఈ లిఫ్ట్ లో ఇప్పటి వరకు కేవలం 58 వేల ఎకరాలకు అందుతున్న సాగునీరు
– ఈ లిఫ్ట్ వంద శాతం పూర్తయితే గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు సస్యశామలం
……………………………………….
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………..
గద్వాల,అలంపూర్ నియోజకవర్గా ల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు దశాబ్దాలు గడిచినా పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి వరద సమయం లో 21.425 టీఎంసీ ల నీటిని తరలించేందుకు చేపట్టిన నెట్టెంపాడు లిఫ్ట్ పనులు అరకొరగానే పూర్తిచేశారు. ధరూర్ మండలంలోని నెట్టెంపాడు, ఉప్పేరు గ్రామాల సమీపంలో ఈ లిఫ్ట్ ను నిర్మించారు. జూరాల నుంచి కాలువల ద్వారా నీటిని ఈ నెట్టెంపాడు లిఫ్ట్ వరకు చేరుస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. పంపింగ్ చేసిన నీరు కాలువల ద్వారా గూడెం దొడ్డి, ర్యాలంపాడు జాలాశయాలకు తరలిస్తారు. ఈ పనులన్నీ ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఈ జలాశయాల నుంచి పంట పొలాలకు వెళ్లే కాలువల పనులు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి.ఈ కాలువల పనులు పూర్తవుతే గద్వాల నియోజకవర్గం లోని గట్టు, ధరూర్, మల్దకల్ మండలాలకు,అలంపూర్ నియోజకవర్గం లోని ఐజ, ఇటిక్యాల మండలాలకు సాగునీరు అందుతుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ లిఫ్ట్ యొక్క ముఖ్య ఉదేశ్యం. లిఫ్ట్ పనులు, రెండు జలాశయాల నిర్మాణం పనులు పూర్తయినా కాలువల పనులు పెండింగ్ లో ఉండడం తో నేటి వరకు 58 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. కాలువల పనుల కోసం భూసేకరణ చేపట్టాల్సి ఉంది. భూసేకరణ చేపట్టడం లో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది.ఈ లిఫ్ట్ ప్రారంభం నుంచి ఇంతవరకు నలుగురు ముఖ్య మంత్రులు మారినా ఈ కాలువల పనులు ముందుకు సాగక పోవడం తో లిఫ్ట్ నిర్మాణం పూర్తయినా ఉపయోగం లేకుండా పోయింది. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ లిఫ్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం గా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నెట్టెంపాడు లిఫ్ట్ ప్రాంతం సందర్శించి కాలువల పనులు వెంటనే పూర్తి చేసి రెండు నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించినా ఆచరణలో అమలు కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్ ) అధికారంలోకి వచ్చింది.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తరువాత నెట్టెంపాడు లిఫ్ట్ గురించి పట్టించుకోలేదు. పదేళ్ల కెసిఆర్ పాలన లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని పెండింగ్ ప్రాజెక్టు లను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయలేదు.కొత్తగా పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ పనులు చేపట్టి పదేళ్ల లో ఈ ప్రాజెక్టు పనులు కూడా సాగదీశారు. పదేళ్లు అధికారం లో ఉంdi కూడా ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండానే అధికారం కోల్పోయారు. 2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. జిల్లా కు చెందిన ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిగా భాద్యతలు చేపట్టారు. ఇక జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పనులు పరుగులు తీస్తాయని జిల్లా ప్రజలు ఆశతో ఎదురు చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే పడి ఉన్నాయి. ఇంకా మూడేళ్ళ సమయం లోనైనా ప్రాజెక్టు లు పూర్తవుతాయో లేదో అని జిల్లా రైతాంగం ఎదురుచూస్తోంది. ఒక్క నెట్టెంపాడు లిఫ్ట్ పూర్తి స్థాయిలో వినియోగం లోకి వచ్చినా రెండు నియోజకవర్గాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉన్న ఈ రెండు నియోజకవర్గాలు సాగునీటి కోసం ఉద్యమించే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు.

……………………………………
గుడెం దొడ్డి రిజర్వాయర్:
…………………………………….
నెట్టెంపాడు లిఫ్ట్ నుంచి మోటార్ల ద్వారా పంపింగ్ చేసిన నీరు గూడెం దొడ్డి జలశయానికి చేరుతుంది.దీనిని ధరూర్ మండలంలోని గుడెం దొడ్డి గ్రామం వద్ద నిర్మించారు . దీని నీటి నిల్వ సామర్థ్యం ఒక టి.ఎం.సి ఉంటుంది.ఈ రిజర్వాయర్ నీటి ద్వారా 62 వేల ఎకరాలకు సాగు నీటిని అందించాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉదేశ్యం.
………………………………….
ర్యాలంపాడు రిజర్వాయర్:
………………………………..
నెట్టెంపాడు లిఫ్ట్ కింద మరో జలశయాన్ని నిర్మించారు.
ఇది కూడా ధరూర్ మండలంలోని ర్యాలంపాడు గ్రామం వద్ద నిర్మించారు.. దీని నీటి నిల్వ సామర్థ్యం 2.3 టిఎంసిలు. ఈ రిజర్వాయర్ నీటి ద్వారా 1.38 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందిస్తారు. ఈ రెండు రిజర్వాయర్ల మధ్య దూరం ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు జలాశయాలు నిర్మించి చాలా కాలం కావడం తో నిర్వహణ లేక పూర్తి స్థాయిలో నీరు నింపుతే లీకేజి ల సమస్య అధికారులకు తలనొప్పి గా మారింది.ఈ నెట్టెంపాడు ప్రాజెక్టు పై ప్రభుత్వం దృష్టి పెట్టి పూర్తి చేసినట్లుయితే నడిగడ్డ ప్రాంతం పచ్చని పైరులతో కళకళలాడే అవకాశం ఉంది.