-హైదరాబాద్‌లో చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్షలు
ముద్ర, హైదరాబాద్: చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 23, 24, 25 తేదీలలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం నేతలు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే T. Harish Raoను కోరారు.
ఈ రోజు ఉదయం ఆయన నివాసంలో సంఘం అధ్యక్షుడు వనం శాంతి కుమార్, కార్యదర్శి ముషం నరహరి కలిసి దీక్షలకు విచ్చేసి చేనేత కార్మికులకు సౌహార్ద సందేశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను హరీష్ రావుకు వివరించారు. ముఖ్యంగా చేనేత కార్మికులకు అమలు చేయాల్సిన ‘చేనేత భరోసా’ పథకం అమలు చేయడం లేదని, అలాగే త్రిఫ్ట్ పథకం కింద కార్మికులు డిపాజిట్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కేవలం రెండు నెలల వరకు మాత్రమే వాటా చెల్లించి, గత తొమ్మిది నెలలుగా డిపాజిట్లు చేయడం లేదని సంఘం నేతలు తెలిపారు.
వారి సమస్యలను హరీష్ రావు శ్రద్ధగా విన్నారని సంఘం నేతలు పేర్కొన్నారు. మార్చి 23న ప్రారంభమయ్యే రిలే నిరాహార దీక్షలకు చేనేత వర్గానికి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే Chinta Prabhakarను ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లు కూడా ఆయనకు తెలిపారు.
దీక్షా శిబిరానికి తాను కూడా విచ్చేసి మద్దతు తెలుపుతానని హరీష్ రావు హామీ ఇచ్చినట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం కార్యదర్శి ముషం నరహరి వెల్లడించారు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వము తక్షణమే చర్యలు తీసుకోవాలని సంఘం నేతలు ఈ సందర్భంగా కోరారు.