సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందని సేవలు
రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి పడిగాపులు
మధ్యాహ్నం తర్వాత సేవలు పున:ప్రారంభం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మొరాయించిన సర్వర్లతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. సుమారు నాలుగు గంటల పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు సాగ లేదు. దీంతో స్లాట్ బుకింగ్ చేసుకుని.. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు.. గంటల తరబడి ఆఫీసుల ముందు పడిగాపులు కాశారు. మంగళవారం ఉదయం నుంచే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సర్వర్లు పనిచేయకుండా పోయాయి. ఫలితంగా తెలంగాణలో భూములు, ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్లాట్ బుకింగ్‌లు, చలాన్ల చెల్లింపులు కూడా ఆగిపోయాయి. ఈ క్రమంలోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూమి బదిలీ చేసేందుకు కార్యాలయాలకు వచ్చిన కొందరు నిరాశతో వెనుదిరిగి ఇంటికి వెళ్లారు. మరికొందరు సేవలు ప్రారంభమయ్యే వరకు అక్కడే వేచి చూశారు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను జనం నిలదీశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని సర్వర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతోనే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్లు సంబంధిత అధికారులు చెప్పినా వినకుండా వారితో వాగ్వాదానికి దిగారు. ఉదయం ఆఫీసులు ప్రారంభం అయినప్పటి నుంచే సర్వర్లు మొరాయించడంతో భూముల క్రయ, విక్రయాలు నిలిచిపోయి.. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ కేవైసీ సహా రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏ పనీ సాగలేదు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్ చేసుకుని.. కొనుగోలుదారులు, అమ్మకందారులు సాక్షులతో సహా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి ఉదయం నుంచి పడిగాపులు కాశారు. మరోవైపు.. దూర ప్రాంతాల నుంచి ఆఫీసులకు వచ్చిన వారు సర్వర్లు ఎప్పుడు పని చేస్తాయి.. తమ పని ఎప్పుడు అవుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రిజిస్ట్రేషన్ల శాఖ మెయిన్ సర్వర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయినట్లు గుర్తించిన అధికారులు.. టెక్నికల్ టీమ్‌లను రంగంలోకి దించారు. సర్వర్ మొరాయింపులను సరి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో తిరిగి సేవలను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.