బోడుప్పల్, ముద్ర విలేకరి
బోడుప్పల్ నగర పాలకసంస్థ పరిధి పెంటారెడ్డి కాలనీలో కొలువైవున్న మాతా నిమిషాంబికా అమ్మవారి ఆలయ ట్రస్ట్ మంగళవారం మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను పంపిణీ చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజలు చేయాలని భక్తులకు అవగాహన కల్పిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్నారు. హంపీ విరూపాక్ష విద్యారణ్యస్వామి మహా సంస్థానం సారథ్యంలో హెచ్.ఎం.డి.ఏ సహకారంతో నిమిషాంబికా ఆలయ ట్రస్ట్, రాష్ట్ర నకాష్ సంఘం ఈ విగ్రహాలను పంపిణీ చేశాయి.
ఈ క్రమంలో మంగళవారం 550 మట్టి గణపతి విగ్రహలను భక్తులకు ఉచితంగా అందజేశారు. భక్తులు చాలా సంతోషంగా ప్రతిమలను తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె.అశోక్ కుమార్, ఎస్.శ్రీనివాస్, ముఖ్య అతిథిగా రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు, అర్చకులు చంద్రశేఖర్ శర్మ, ఉమ కాంత్ శర్మ పాల్గొని ప్రతిమలను పంపిణీ చేశారు. మట్టి గణపతి విగ్రహాల వల్ల పర్యావరణానికి ఏవిధమైన హాని కలగదని రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచర్ల శ్రీనివాసరావు అన్నారు.