Take a fresh look at your lifestyle.

ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి-కలెక్టర్ ప్రతీక్ జైన్

 

సీజ్ చేసి వాహనాలు నా అనుమతి లేనిదే వదిలి పెట్టవద్దు

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలి

– మొరం మట్టి రవాణా కు సైతం ఆన్ లైన్ అనుమతి !

 

ముద్ర, నారాయణ పేట :

ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలని….జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఇసుక మన వాహనం ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మన ఇసుక మన వాహనం పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ డాక్టర్ వినీత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు.

జిల్లాలోని మూడు సర్కిళ్ల సీ ఐ లు, అన్ని మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్. ఐ లు, మైనింగ్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… ఇంతవరకు ఏం జరిగిందో వదిలేయాలని, ఇకపై జిల్లాలో గుర్తించిన ఐదు ఇసుక రీచ్ ల నుంచి మన ఇసుక – మన వాహనం ఆన్ లైన్ అనుమతి ద్వారానే ఇసుక రవాణా జరగాలని, అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే.. వాహనాలను సీజ్ చేసి తన అనుమతి లేనిదే వదిలి పెట్టవద్దని ఆయన తేల్చి చెప్పారు. కోస్గి, మాగనూరు మండలాల్లో అనుమతి లేకుండా ఇసుక రవాణా జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇక పై అనుమతి లేనిదే జిల్లాలో ఎక్కడా కూడా ఇసుక రవాణా జరగడానికి వీలు లేదని కలెక్టర్ ఖరాఖండిగా చెప్పారు. తహాసిల్దారులు, ఎస్.ఐ. ఎంపీడీవోలు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణా కు చెక్ పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక కు అనుమతి ఇవ్వాలన్నారు. ఇకపై జిల్లాలో మొరం మట్టి రవాణా కు మ్యాన్ వల్ పద్ధతిలో అనుమతి ఇవ్వకుండా మన ఇసుక మన వాహనం పద్ధతిలాగే ఆన్ లైన్ ద్వారానే అనుమతులు ఇచ్చే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుందామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ మాట్లాడుతూ… ప్రభుత్వానికి నష్టం కలిగకుండా ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకొని వాహనాలను సీజ్ చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.