ముద్ర, మహదేవపూర్:

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్న అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి, అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. వంట సిబ్బంది పరిశుభ్రతను పాటించడంతో పాటు, ఆహార పదార్థాలు తాజాగా ఉండేలా చూడాలని, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించొద్దని ఆదేశించారు. భోజనం బావుంది ప్రతి రోజు ఇలానే చేయాలని వంట సిబ్బందిని అభినందించారు.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా సమతుల్య ఆహారం అందించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని, విద్యార్థులు క్రీడల్లో రాణించాలని, విద్యార్థులు మంచి అలవాట్లు అలవరచుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, భద్రతా పరమైన చర్యలపై దృష్టి సారించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు, ప్రహరీ గోడ పైభాగంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్సిపాల్ జీవరత్నం, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.