Take a fresh look at your lifestyle.

అమల్లోకి మరో 25 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్‌

  • ప్రజ‌ల‌కు మ‌రింత చేరువ‌గా స‌బ్ రిజిస్ట్రార్ సేవలు.
  • ప్రజ‌ల‌కు సంతృప్తిక‌ర సేవ‌లే లక్ష్యం.
  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజ‌ల‌కు అత్యుత్తమ సేవ‌లు అందించాల‌న్న ల‌క్ష్యంతో స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ప్రజలకు మ‌రింత చేరువచేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ప్రజలకు మెరుగైన సేవ‌లు అందించాల‌న్న ప్రభుత్వ ఆలోచ‌న‌లు, ఆకాంక్షల‌కు అనుగుణంగా అధికారులు ప‌ని చేయాల‌ని ఆదేశించారు. రెండవ ద‌శ‌లో భాగంగా రాష్ట్రం లో 25 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో సోమవారం స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభ‌మైంది. మొదటి దశలో ని 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో, రెండో దశలో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి పర్యవేక్షించారు. ఈ సంద‌ర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఈరోజుతో 47 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ఈ విధానం అమ‌లులోకి వ‌చ్చింద‌ని చెప్పారు. వ‌చ్చే నెల‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమ‌లు చేస్తామ‌న్నారు. రిజిస్ట్రేష‌న్‌కు వ‌చ్చి గంట‌ల త‌ర‌బ‌డి చెట్ల కింద నిరీక్షించి క్యూ లైన్లలో నిల్చోనే ప‌రిస్దితికి అడ్డుక‌ట్ట వేసేందుకు, స‌మ‌యాన్ని ఆదా చేసేందుకు, పార‌ద‌ర్శక‌త‌ను తీసుకురావ‌డానికి ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావ‌డం జ‌రిగింద‌న్నారు. త్వరలో క్యూలైన్లకు గుడ్‌బై చెప్పే రోజులు వ‌స్తాయ‌న్న ఆయన ద‌ళారులు ప్రమేయం కూడా ఉండ‌బోద‌న్నారు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా కేవ‌లం 15 నిమిషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ పూర్తి అవుతుండ‌డం ప‌ట్ల ప్రజ‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నార‌ని అన్నారు. రిజిస్ట్రేష‌న్ శాఖ అధికారిక వెబ్ సైట్ registration.telangana.gov.in స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏరోజు వీలుంటే ఆరోజు ఆ స‌మ‌యానికి వ‌చ్చి రిజిస్ట్రేష‌న్ చేయించుకునేలా స్లాట్ బుకింగ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పారు. అలాగే సేవల్లో జాప్యం, సిఫార్సులు, దళారుల జోక్యం లేకుండా ప్రజ‌లకు మెరుగైన సేవలు అందుతాయ‌న్నారు. ప్రజ‌ల సౌక‌ర్యార్ధం అవ‌స‌ర‌మైన చోట రిజిస్ట్రార్ల సంఖ్య కూడా పెంచుతున్నామ‌ని మంత్రి వివరించారు.

  • స్లాట్ బుకింగ్ అనుభ‌వాలు:

 

  • పది నిముషాల్లోనే రిజిస్ట్రేష‌న్ పూర్తి ( సంతోష్‌కుమార్ రెడ్డి – ఉప్పల్ ఎస్.ఆర్‌. వో ఆఫీస్‌).

ఉప్పల్ స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నా ఇంటి రిజిస్ట్రేష‌న్ కోసం శుక్రవార‌మే స్లాట్ బుకింగ్ చేసుకున్నాను. ఐఐసిటీ కాల‌నీ- బోడుప్పల్ లో ఉంటున్న నేను రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లినంత స‌మ‌యం కూడా అక్కడ రిజిస్ట్రేష‌న్ ఆఫీసులో ప‌ట్టలేదు. కేవ‌లం 10 నిముషాల్లోనే రిజిస్ట్రేష‌న్ పూర్తయింది. మొత్తం అరగంట వ్యవ‌ధిలోనే డాక్యుమెంటు తీసుకొని వ‌చ్చేశాం. నిజంగా ఈ విధానం చాలా బాగుంది. దీనివ‌ల‌న ఎక్కడా ఇబ్బంది ప‌డ‌లేదు స‌రికదా స‌మ‌యం చాలా ఆదా అయింది.

  • 2-3 రోజులు ప‌ట్టే ప‌ని ఇప్పుడు అర‌గంట‌లోనే: ఎ. శ్రీ‌ల‌త ( కాప్రా- ఎస్.ఆర్‌. వో ఆఫీస్)

వ‌డ్డేప‌ల్లికి చెందిన మేము సోమ‌వారం కాప్రా ఎస్.ఆర్‌. వో ఆఫీస్ లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకున్నాం. గ‌తంలో రిజిస్ట్రేష‌న్‌కు ఒక రోజంతా ఉండేవారం. త‌రువాత 2 నుంచి 3 రోజుల త‌ర్వాత మాకు రిజిస్ట్రేష‌న్ డాక్యుమెంట్లు ఇచ్చేవారు. ఇప్పుడ‌ది లేదు రిజిస్ట్రేష‌న్ 15 నిముషాల్లో పూర్త‌వ‌డం, మ‌రో 15 నిముషాల్లో డాక్యుమెంట్లు సిద్దం కావ‌డం చాలా బాగుంది. ర‌ద్దీ లేకుండా ప్రశాంత వాతావ‌ర‌ణంలో ప‌ని పూర్తయింది. దీనినే కొన‌సాగించ‌డం ఎంతో ఉత్తమం

  • ఒకేసారి రిజిస్ట్రేష‌న్ – మ్యుటేష‌న్ చాలా సౌక‌ర్యవంతం: స‌ర‌ళ ఎన్. స‌ర‌ళ ( హ‌నుమ‌కొండ -ఎస్.ఆర్‌. వో ఆఫీస్‌)

హ‌నుమ‌కొండ ఎస్.ఆర్‌. వో ఆఫీస్ లో సోమ‌వారం ప్రారంభ‌మైన స్లాట్ బుకింగ్ తో ఒకేసారి రిజిస్ట్రేష‌న్‌, మ్యుటేషన్ కూడా జ‌రగ‌డం చాలా సౌక‌ర్యంగా అనిపించింది. గ‌తంలో రిజిస్ట్రేష‌న్ ఒక తంతు అయితే మ్యుటేష‌న్ మ‌రో తంతుగా మూడు రోజులకు మించి జ‌రిగేది. కానీ కొత్త స్లాట్ విధానం వ‌ల‌న మా ప్లాట్ రిజిస్ట్రేష‌న్ , మ్యుటేష‌న్ కూడా జ‌రిగిపోయింది. డాక్యుమెంట్ రైట‌ర్ సాయంతో మేం స్లాట్ బుక్ చేసుకున్నాం. మాకు ఎక్క‌డా అద‌న‌పు ఖ‌ర్చులు లేవు. ఈ రోజు ఉద‌యం స్లాట్ బుక్ చేసుకున్నాం. ఇదే రోజు మొత్తం ప‌ని పూర్తయింది.

  • అధికారుల స‌హ‌కారం బాగుంది : ( ఎ. భార‌త‌మ్మ కల్వకుర్తి ఎస్‌. ఆర్‌.వో ఆఫీస్‌)

కల్వకుర్తి ఎస్‌. ఆర్‌.వో ఆఫీస్ లో సోమ‌వారం మా ఇంటిస్ధలం కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేష‌న్ జ‌రిగింది.నిన్ననే స్లాట్ బుక్‌చేయించాం. గ‌తంలోలా డాక్యుమెంట్ రైట‌ర్ల హ‌వా క‌నిపించ‌లేదు. అధికారులు చాలా బాగా స‌హ‌క‌రించారు. ప‌ని చాలా తొంద‌ర‌గా పూర్తయింది. మొద‌టి నుంచి స్లాట్ బుకింగ్ కు అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయ‌డం వంటి ప‌నుల కార‌ణంగా హ‌డావుడి లేకుండా రిజిస్ట్రేష‌న్ జ‌రిగిపోయింది. ఇటువంటి విధానాలు ప్రజ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని మాతో పాటు రిజిస్ట్రేష‌న్‌కు వ‌చ్చిన వారు కూడా చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.