ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు
అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయుధాలను అప్పగిస్తాం
మాదకద్రవ్యాల మహమ్మారిని తరమికొడదాం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర, హైదరాబాద్ : డ్రగ్స్, గంజాయి స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు అధికారుల ఆత్మరక్షణ కోసం ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇచ్చే అంశం ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయుధాలను అప్పగిస్తామని ప్రకటించారు. ఈ పోరాటంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అధికారుల వెంటే ఉంటుందని చెప్పారు. అవసరమైన వనరులు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ, క్యాలెండర్లను శుక్రవారం రవీంద్రభారతిలో మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల వరకు తరిమికొట్టడం ద్వారా తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. డ్రగ్స్ తో కలిగే సామాజిక అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు కోరల్లో చిక్కి ఎంతోమంది యువత భవిష్యత్తు నాశనమవుతోందన్న ఆయన ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తలిదండ్రుల ఆశలు అడియాశలవుతున్నాయన్నారు. ఇలాంటి అరాచక శక్తులను సమాజం నుంచి ఏరిపారేయాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి గంజాయి ముఠా దాడిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి అధికారులు తమ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్న మంత్రి… ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అదనపు కమీషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ, ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ సురేష్ రాథోడ్, జాయింట్ కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్) జి.అంజన్ రావు, డిప్యూటీ కమిషనర్ జె. హరికిషన్, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సూర కృష్ణ, జనరల్ సెక్రటరీ చిరంజీవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.