ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం
శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవతో మొదలుకొని నిత్య కైంకర్యాలు జరిగాయి. సహస్ర నామార్చన సేవతో పాటు లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు.ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంత్రం శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు.
