ముద్ర.పరకాల.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈనెల 11న పరకాల మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు ఉండగా ప్రధాన పార్టీలు ప్రచారంలో వినూత్న పద్ధతులు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునే దిశలో ఆ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో అభ్యర్థులు తల మునకలైనారు. ఈ క్రమంలో మున్సిపాలిటిలో అత్యధిక స్థానాలను గెలుచుకొని పట్టణ నిలుపుకునే క్రమంలో ప్రధాన పార్టీలు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన ఆయా పార్టీల నియోజకవర్గ ఇన్చార్జీలు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, పరకాల మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్ల ధర్మారెడ్డి , బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ కాళీ ప్రసాదరావు పార్టీలను ముందుండి నడిపిస్తున్నారు. గత రెండు పర్యాయాలు పరకాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా ఈ ఎన్నికల్లోను 22 వార్డులలో అత్యధిక స్థానాలను గెలుచుకొని పట్టు నిలుపుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ప్రజలను ఆకర్షించే పనిలో దూసుకుపోతుంది. పరకాల మున్సిపాలిటీగా అవతరించిన అనంతరం జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఐదు ఆరు స్థానాలను దక్కించుకొని పెద్ద పార్టీగా నిలిచిన స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన వ్యక్తి టిఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ స్థానాన్ని తగ్గించుకున్నాడు. రెండోసారి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరకాల మున్సిపాలిటీలో ఒకే ఒక స్థానాన్ని దక్కించుకొన్నది. ఈ ఎన్నికలలో పరకాల మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండాను ఎగరవేయడం కోసం స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర కావాలని తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. ఆ క్రమంలో పార్టీలో అత్యంత బలమైన వ్యక్తులను రంగంలోకి దింపి పరకాల మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలని వ్యూహరచనలు పన్నుతూ ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నాడు. 22 వార్డులకు గాను 12 13 స్థానాలను గెలుచుకొని నియోజకవర్గ కేంద్రమైన పరకాలలో పార్టీ పట్టును పెంచుకోవాలని ప్రయత్నంతో ప్రచారాన్ని వంటి చేత్తో నడిపిస్తున్నాడు. ఈ ఎన్నికలలో పరకాల మున్సిపాలిటీలోని 22 వార్డులలో బిజెపి తన అభ్యర్థులను రంగంలోకి దింపింది. గత ఎన్నికల నాటికి పరకాల మున్సిపాలిటీలో బిజెపికి నాలుగు మంది కౌన్సిలర్లు గెలుపొందారు.ఈసారి మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడం కోసం బిజెపి 22 మంది అభ్యర్థులను రంగంలోకి దింపింది. వారిని గెలిపించుకోవడం కోసం బిజెపి నాయకత్వం తీవ్రంగా శ్రమిస్తుంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం కొత్త కొత్త పద్ధతులతో ఓటర్ల వద్దకు వెళుతున్నారు.