వికారాబాద్, ముద్ర : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీప్ జైన్ గురువారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.తాసిల్దార్ కార్యాలయంలో విద్యుత్ మరమ్మత్తులతోపాటు ప్రహరీ గోడను నిర్మించాలని సంబంధిత అధికారులకు సూచించారు.తాసిల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి రికార్డులను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించాలని సూచించారు.తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో దివ్యాంగుల కోసం ఏర్పాటుచేసిన స్టాల్ ను కలెక్టర్ పరిశీలించారు.అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి అక్కడి వస్తువులను పరిశీలించారు.ఆస్పత్రి పరిసరాలను, వార్డులను పరిశీలించి కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు సరిపడా చికిత్సకు సంబంధించిన పరికరాలను సమకూర్చుకోవాలని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సూచించారు.సదరం క్యాంపును నిర్వహించే స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లను ఇలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, ఆర్డీవో వాసు చంద్ర, తాసిల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.