క్యాంపు రాజకీయాలకు తెర- 2-3 ఫార్ములాకు ఒకే
మొదటి రెండేళ్లు చైర్ పర్సన్ అభ్యర్థిగా ఎర్నేని కుసుమ కుమారి – వైస్ చైర్మన్ గా దేవరపల్లి మల్లీశ్వరి
తర్వాతి మూడేళ్లు చైర్ పర్సన్ గా పారా సత్యవతి – వైస్ చైర్మన్ గా గుండపునేని పద్మావతి
మొత్తంగా నారీ మణులకే అవకాశం

ముద్ర ప్రతినిధి , కోదాడ … కోదాడ పుర పీఠాన్ని మొదటి రెండేళ్లు మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ కుమారి దక్కించుకున్నారు. గత కొన్ని రోజులుగా చైర్ పర్సన్ అభ్యర్థి ఎవరనే విషయంలో నెలకొన్న సందేహానికి ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం మంత్రి ఉత్తమ్ , ఎమ్మెల్యే పద్మావతి దంపతులు తెర దింపారు. ఈ నెల 13 శుక్రవారం మున్సిపల్ ఫలితాలు వెలువడిన అనంతరం గెలిచిన 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో హైదరాబాద్ లోని మొయినాబాద్ లో గల ఒక ఫామ్ హౌస్ నందు క్యాంపు నిర్వహించారు . శని , ఆది వారాలలో మంత్రి ఉత్తమ్ దంపతులు క్యాంపు లో ఉన్న కౌన్సిలర్లతో పాటు కోదాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత చైర్ పర్సన్ రేసులో ఉన్న నలుగురు అభ్యర్థులతో కూడా విడి విడి గా మాట్లాడిన అనంతరం ఆదివారం సాయంత్రానికి కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ , వైస్ చైర్మన్ ల అభ్యర్థిత్వానికి తెర దించారు . రేసులో ఉన్న నలుగురు అభ్యర్థులలో మొదటి రెండు సంవత్సరాలు ఒకరికి చైర్మన్ , మరొకరికి వైస్ చైర్మన్ అవకాశం ఇవ్వగా , తర్వాతి మూడు సంవత్సరాలు మిగిలిన ఇద్దరిలో ఒకరికి చైర్మన్ , మరొకరికి వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
2-3 ఫార్ములాకు మొగ్గు చూపిన మంత్రి దంపతులు
మొదటి రెండు సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని … చైర్ పర్సన్ గా మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ కుమారి కి , వైస్ చైర్మన్ గా దేవరపల్లి మల్లేశ్వరి కి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా, ఇక తరువాతి మూడు సంవత్సరాలు చైర్ పర్సన్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన పారా. సత్యవతి కి , వైస్ చైర్మన్ గా గుండపునేని పద్మావతి కి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం . దీనికి కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆమోదం తెలిపారని తెలుస్తుంది . అయితే మొత్తంగా చైర్మన్ , వైస్ చైర్మన్ లుగా మహిళలకే అవకాశం కల్పించడం గమనించదగ్గ విషయం.
క్యాంపు నుండి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి
మున్సిపల్ ఫలితాల అనంతరం శుక్రవారం సాయంత్రం గెలిచిన 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లకు హైదరాబాద్ లోని మొయినాబాద్ నందు ఒక ఫామ్ హౌస్ లో క్యాంపు ఏర్పాటు చేశారు . అక్కడి నుండి ఈ రోజు (సోమవారం) ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొంటారని సమాచారం .