- వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య
ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ముందు వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన సన్నహాక సమావేశాన్ని విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య అన్నారు. శనివారం కల్వకుర్తి పట్టణంలో ని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు 6000 ఇతర చేయూత పెంచందారులకు 4000 కండరాల క్షీణత గల వికలాంగులకు 15000 పింఛన్లు పెంచుతామని చెప్పి 19 నెలలు గడుస్తోందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వచ్చేనెల 13న చలో హైదరాబాద్ వికలాంగుల మహా గర్జన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికలాంగులు చేయుత పెన్షన్దారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జ్ ఆడెపు నాగార్జున మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మద్దిలేటి మాదిగ, ఎంఎస్పి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కూట విజయ్ మాదిగ, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ సలీం, ఎమ్మార్పీఎస్ కల్వకుర్తి మండల అధ్యక్షులు శేఖర్ మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ సాజిత్ ఆలీ, కల్వకుర్తి మండల ఇన్చార్జి ఎం రవి , కో – ఇన్చార్జీలు యాదయ్య స్వామి, బసవయ్య పాండు వెంకటయ్య, వెల్దండ మండల ఇన్చార్జి కొమ్ము మహేష్ కో ఇన్చార్జీలు దేవదానం రామస్వామి, ఊరకొండ మండల ఇన్చార్జి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.