యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: బొగ్గు గని కార్మికుల పెన్షన్ పథకం, దాని అమలు తీరుపై, సింగరేణి రిటైర్డ్ కార్మికులు సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు గని కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికై, భారత ప్రభుత్వం “ది కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ – 1998” ను అమలు చేస్తుంది. ఇది గతంలో ఉన్న కోల్ మైన్స్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ – 1971 స్థానంలో రాగా, ఈ పథకం 1994 నుండి వర్తించేలా అమలు చేయబడుతున్న విషయం తెలిసిందే. బొగ్గు గనుల పరిశ్రమలో కనీసం 10 సంవత్సరాలు పనిచేసిన కార్మికులు కనీసం 40 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలనే నిబంధన ఉంది. ఇక ఉద్యోగికి వారి చివరి 10 నెలల సగటు జీతం, అందించిన సేవా సంవత్సరాల ఆధారంగా నెలవారీ పెన్షన్ చెల్లించడం జరుగుతుంది. ఇక కుటుంబ పెన్షన్ విషయానికి వస్తే, కార్మికుడు మరణించిన సందర్భంలో, వారి జీవిత భాగస్వామికి (భార్య/భర్త), ఆధారపడిన పిల్లలకు కుటుంబ పెన్షన్ చెల్లించడం జరుగుతుందనే విషయం తెలిసిందే. పరిశ్రమ యాజమాన్యం, ఉద్యోగి, ఇరువురు, ఉద్యోగి వేతనం లో నిర్దిష్ట శాతాన్ని పెన్షన్ ఫండ్‌కు జమ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా పెన్షన్ ఫండ్‌కు తన వంతు సహకారం అందిస్తుంది. ఈ ప్రక్రియను కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ పథకాన్ని నిర్వహిస్తుంది. ఇక పెన్షన్లు చెల్లింపుల విషయానికి వస్తె ప్రభుత్వ రంగ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల ద్వారా చెల్లింపులు జరుగుతుంది. ఇందుకు పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన విషయము కూడా తెలిసింది. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా బొగ్గు గని కార్మికుల కనీస పెన్షన్ రూ. 1000కి పెంచబడింది. ఈ మేరకు “ది కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్–1998” కి సవరణలు ప్రకటిస్తూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ 2024 మార్చి 8న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పెరిగిన పెన్షన్ 2024 మార్చి నుండి అమల్లోకి వచ్చింది.గతంలో కొన్ని కేటగిరీల కార్మికులకు కొందరికి కనీస పెన్షన్ రూ.250 ఉండగా, మరికొందరికి రూ.350 ఉండేది. అయితే, ఈ పెంపు రూ.1000 లోపు పెన్షన్ ఉన్న కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే రూ.1001 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న వారికి తాజా పెంపుతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత తరుణంలో కేవలం రూ. వెయ్యికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రిటైర్డ్ కార్మికులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. పదవీ విరమణ పొందిన బొగ్గు గనుల ఉద్యోగుల కుటుంబాలు రూ.1000 పెన్షన్‌తో ఎలా జీవించా లాంటూ ప్రభుత్వాన్ని, పాలక వర్గాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు కార్మిక సంఘాలు కనీస పెన్షన్‌ను రూ.10,000 కు పెంచాలని డిమాండ్ చేస్తుండగా, మరోవైపు సిఎంపిఎస్ ట్రస్ట్ ఫండ్ ప్రస్తుతం నిధుల కొరతను ఎదుర్కొంటుంది. ఒకవైపు ఉద్యోగుల సంఖ్య తగ్గడం, మరోవైపు పదవీ విరమణ చేసే వారి సంఖ్య పెరగడంతో ట్రస్ట్ లో నిధులు తరిగిపోతున్నాయి. ప్రతి నెల ట్రస్ట్‌లో రూ.4,150 కోట్లు జమ అవుతుండగా, చెల్లింపులు రూ.4,450 కోట్లు జరుగుతుంది. అనగా ప్రతి నెల రూ.300 కోట్ల నిధుల లోటు ఏర్పడుతోంది. ఇక సమస్యను అధిగమించడానికి, ప్రతి టన్ను బొగ్గు అమ్మకంపై రూ.10 చొప్పున ట్రస్ట్‌కు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది నిధిని పెంచడానికి సరిపోవడం లేదు. ఇక 2007 లోపు రిటైర్ అయిన కార్మికులకు ఇప్పటికీ రూ.500 నుంచి రూ.2 వేల లోపు మాత్రమే పెన్షన్ అందుతోంది. చాలా మంది బొగ్గు గని కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే అతి తక్కువ పెన్షన్ పొందుతున్నారు. తెలంగాణలో ఆసరా పెన్షన్ కంటే కూడా తమ పెన్షన్ తక్కువగా ఉందని సింగరేణి రిటైర్డ్ కార్మికులు విచారం చెందుతున్నారు.ఈ పథకం ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పెన్షన్ సొమ్మును పెంచాలని చట్టంలో ఉన్నప్పటికినీ ఇప్పటివరకు అలాంటి పెంపుదల జరిగిన దాఖలాలు లేవు. 2025 ఏప్రిల్ నాటికి సింగరేణి సంస్థ టన్ను బొగ్గు ఉత్పత్తిపై రూ. 20 చొప్పున కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ ట్రస్ట్ బోర్డుకు జమ చేస్తామని ప్రకటించింది. దీని వల్ల సంవత్సరానికి సుమారు రూ. 140 కోట్లు జమ అయ్యే అవకాశం ఉంది. ఈ నిధితో పదవీ విరమణ పొందనున్న సింగరేణి కార్మికులకు ప్రస్తుతం అందుతున్న పెన్షన్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ బొగ్గు గని కార్మికుల పెన్షన్ సమస్యలు మాత్రం ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదనీ చెప్పవచ్చు. దీనిపై కార్మిక సంఘాలు, పెన్షనర్ల సంఘాలు నిరంతరం పోరాడుతూనే ఉన్నాయనేది స్పష్టం. ఇక మరోవైపు ది సింగరేణి ఓపెన్ కాస్ట్ ఆల్ ఈపి ఆపరేటర్స్ అసోసియోషన్ E – 1152 ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటేశ్వర్లు, రిటైర్డ్ కార్మికులు, పెన్షన్ పథకం అమలు తీరుపై నిరసన ప్రకటిస్తున్నారు.