Take a fresh look at your lifestyle.

ఫిబ్రవరి 16న నార్ల వెంకటేశ్వరరావు వర్ధంతి

తెలుగు పత్రికా రంగానికి మార్గనిర్దేశకుడు నార్ల:

ఎడిటర్ గా ఆయన రాసిన సంపాదకీయలు ఎన్నో సంచలనాలు సృష్టించాయి. మరెన్నో సమస్యల పరిష్కారానికి దారులు వేశాయి. తనకు నచ్చని సంఘటనలు జరిగితే, తెగదెంచుకొని సంస్థలను వదిలివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నవ్యతనూ, నాణ్యతనూ మేళవించి తెలుగు పత్రికారంగానికి ఆయన శోభను తీసుకువచ్చారు. నార్ల పాత్రికేయుడు మాత్రమే కాదు సాహితీవేత్త, కవి, రచయిత, ఉద్యమకారుడు, హేతువాది, మానవవాది. అనేక కవితా ఖండికలు, పద్య సంకలనాలు, సాంఘిక, పౌరాణిక నాటకాలు, వ్యాసాలు రాశారు. వివిధ దేశాల చరిత్రలు, ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు, విజ్ఞాన, నైతిక విలువలను సామాన్య ప్రజానీకానికి పరిచయం చేశారు. ఆయనకు తెలుగుపైనే కాదు ఆంగ్లంపైన కూడా మంచి పట్టు ఉండేది. ఆంగ్లంలో కూడా అనేక రచనలు చేసి పలువురు ప్రశంసలు పొందారు. మూఢ నమ్మకాలు, ఛాందసాలను విమర్శించారు. సామాజి పరిణామాలను భౌతికవాద దృష్టితో పరిశీలించడం నార్ల ప్రత్యేకత.

నార్ల వెంకటేశ్వరరావు పూర్వీకులు మధ్యప్రదేశ్ కు వలస వెళ్ళారు.వారిది వ్యవసాయ కుటుంబం. సైనికులకు కావలసిన ఆహారధాన్యాలు పంపిణీ చేసే కాంట్రాక్టర్లుగా పనిచేసేవారు. 1డిసెంబర్ 1908లో లక్ష్మణరావు,మహాలక్ష్మీ దంపతులకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ లో నార్ల వెంకటేశ్వరరావు జన్మించాడు.తరువాత నార్ల తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చారు.నార్ల విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.పాఠశాల విద్యాభ్యాసం పూర్తయిన తరువాత నార్ల వెంకటేశ్వరరావు మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో బి.ఏ. పూర్తి చేశాడు.

నార్ల చదువుకొనే రోజులలో కృష్ణాపత్రికలో పార్ట్ం సబ్ ఎడిటర్ గా పనిచేశాడు.పట్టాభి సీతారామయ్య గారి ‘జన్మభూమి’ పత్రికకు, పూనా నుండి వెలువడే ‘మహరాటా’ అనే పత్రికకు, లాహోర్ నుండి వచ్చే ‘పీపుల్స్’ అనే పత్రికకు వ్యాసాలు రాసి పంపేవాడు. ఆ పత్రికల ద్వారా వచ్చే కొద్దిపాటి సొమ్ముతో కళాశాల ఫీజులు కట్టేవాడు.ఆ రోజుల్లో వెంకటేశ్వరరావు రాసిన ‘స్వదేశీ సంస్థానాలు’ అనే పుస్తకం గూర్చి కృష్ణా పత్రికలో దాని సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు సమీక్ష చేశారు. భారతదేశం గురించి రాసిన ‘స్వదేశీ సంస్థానాలు అనే రచన అద్భుతమైనది’ అని అభినందించారు.వెయ్యి పుస్తకాలు కేవలం 3 నెలలలోనే అమ్ముడు పోయాయి.ఇది ఆ రోజుల్లో ఒక రికార్డు.తరువాత ‘నేటి రష్యా’ అనే తెలుగు పుస్తకం నార్ల వారు రాసారు.

నార్ల వెంకటేశ్వరరావు సంపాదకుడు మాత్రమే కాక మంచి రచయిత కూడా తెలుగులో,ఆంగ్లంలో ఎన్నో రచనలు చేశాడు.సీత జోస్యం, జాబాలి,నరకంలో హరిశ్చంద్రుడు,ద్రౌపది, హిరణ్యకశ్యప కథ, నవయుగాల బాట నార్ల మాట, దేశ చరిత్రలు,సాంఘిక నాటికలు,ఆషామాషీ, మాటామంతీ, కొత్తగడ్డ మొదలైన ఎన్నో రచనలు చేశాడు.బుద్ధుని ఆరాధించాడు.బౌద్ధ కళాఖండాలు,శివుని విగ్రహాలు, కృష్ణుని విగ్రహాలు సేకరించి ఇంట్లో చిన్న మ్యూజియం ఏర్పాటు చేశాడు.20,000 పుస్తకాలు సేకరించి, ఇంటిలోనే ఒక గ్రంథాలయం ఏర్పాటు చేశాడు.

1958-1970 మధ్య కాలంలో నార్ల వెంకటేశ్వరరావు రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. పారిస్ లో జరిగిన యునెస్కో సాధారణ సమావేశాలకు హాజరైన భారత ప్రతినిధి బృందంలో నార్ల ఒక సభ్యునిగా ఉన్నాడు. అనేక అంతర్జాతీయ,జాతీయ సమావేశాలలో పాల్గొని తన అభిప్రాయాలను నిస్సంకోచంగా చెప్పాడు. కొంత కాలం యన్.టి. రామారావుకు సాంస్కృతిక వ్యవహారాల సలహాదారునిగా ఉన్నాడు.

గొప్ప మానవతావాది, హేతువాది, పత్రికా సంపాదకత్వంలో నూతన ఒరవడి సృష్టించిన మేధావి నార్ల వెంకటేశ్వరరావు 16 ఫిబ్రవరి 1985లో మరణించాడు.నార్ల మరణించిన తరువాత ఆయన సతీమణి సులోచనాదేవి నార్ల సేకరించిన 25,000 గ్రంథాలను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అందజేశారు.

* సుధాకర్.ఏ.వి
* రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు
* స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (STUTS)
* 9000674747

Leave A Reply

Your email address will not be published.