కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయని చెప్పినా వినలేదు
సింగరేణి ప్రయోజనాల కోసమే సీపీఐతో జతకలుద్దామనుకున్నాం
బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కాంగ్రెస్ నేతలు ప్రలోభపెడుతున్నారు
పోలీసులను, గుండాలను ఇంటికి పంపి బెదిరింపులకు గురి చేస్తున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఇప్పటికే పొత్తులో ఉన్న కాంగ్రెస్-సీపీఐ మధ్య కొత్తగూడెం కార్పొరేషన్ లోనూ ఒప్పందం జరిగితే తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసమే తాము సీపీఐతో కలిసి పనిచేద్దామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయని సీపీఐ నేతలతో చెప్పామన్నారు. అయినప్పటికీ సీపీఐ ఏ కారణం చేత పొత్తుకు ఒప్పుకుందో, వాళ్లకు ఏం ఒత్తిళ్లు ఉన్నాయో మాకు తెలియదని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయని ఆరోపించిన కేటీఆర్… సింగరేణిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో కేటీఆర్ మాట్లాడారు. ఈ నెల 11న వెలువడ్డ మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ వచ్చిన 38 పట్టణాల్లో కాంగ్రెస్ నేతలు అరాచకాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకెళ్లి ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను, గుండాలను బీఆర్ఎస్ అభ్యర్ధుల ఇళ్లకు పంపి బెదిరింపులకు గురిచేస్తున్నారని విరుచుకుపడ్డారు. అయినా ఎక్కడా బెదరకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ధైర్యంగా ఉన్నారని చెప్పారు. నేడు జరగనున్న ప్రమాణాస్వీకారంలో సమీకరణాలు మారుతున్నాయన్న ఆయన రాష్ట్రంలో మరిన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్.. గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేశారు
సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు.
లంబాడా తండాలను గ్రామ పంచాయితీలుగా చేసిన మాజీ సీఎం కేసీఆర్ గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేశారని వెల్లడించారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు 3,146 తండాలు, గూడేలను కొత్త గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ చొరవతో ఇప్పుడు 3146 మంది గిరిజన బిడ్డలు సర్పంచ్‌లు అయ్యారని తెలిపారు. గిరిజన తండాల్లో ఇంటింటికీ నీటి వసతి కల్పించామన్న కేటీఆర్.. నాలుగున్నర లక్షల ఎకరాలకు కేసీఆర్ ఒకే రోజు పోడు పట్టాలిచ్చారన్నారు. గిరిజన బిడ్డలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్‌దే అని కేటీఆర్ స్పష్టం చేశారు. గిరిజన బిడ్డల విద్య కోసం వందలాది గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. గిరిజన వ్యాపారవేత్తలకు సీఎంఎస్‌టీ ఆంత్రప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.లక్షలు ప్రభుత్వ సబ్సిడీ ఇచ్చామని అన్నారు. బంజారా బిడ్డలకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు ఇచ్చామని అన్నారు. ప్రతి జిల్లాలో బంజారా భవన్‌కు స్థలం ఇచ్చామని, బంజారా భవన్‌లు కట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో బంజారాలకు మరింత అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.