ముద్ర ప్రతినిధి, మెదక్:
మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.
శనివారం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ హెల్త్ వీక్ లో భాగంగా డ్రగ్స్ కంట్రోల్, రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్ డే మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, యువతలో చైతన్యం నింపేందుకు మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి టీ.ఎన్ జీవో భవన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధికా ప్రారంభించారు.

అనంతరం టీఎన్జీవో భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగాన్ని మూకుమ్మడి అరికట్టాలని, విచ్చలవిడిగా డ్రగ్స్ వాడొద్దని, మెడికల్ షాపుల్లో అమ్మే మందులకు డాక్టర్ పిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. పాఠశాల స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. డ్రగ్స్ రైతు సమాజాన్ని నిర్మించాలన్నారు. సరదా, తాత్కాలిక ఉపశమనం కోసం డ్రగ్స్ ను అలవాటు చేసుకుంటే అత్యంత ప్రమాదం అన్నారు. అనారోగ్య సమస్యలతో జీవితం చిన్నాభిన్నం అవుతుందన్నారు.

ఈగల్ ఫోర్స్ ఏసిపి శివ నాయుడు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు విక్రయాలు చేస్తే చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయన్నారు. మెడికల్ షాపుల్లో ఎలాంటి మత్తు పదార్థాలు దొరికిన షాపును పూర్తిగా మూసివేసి, 20 సంవత్సరాలు కఠినంగా జైలు శిక్ష ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, డిసిహెచ్ శివదయాల్, డీఎస్పీ ప్రసన్నకుమార్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు, మెడికల్ షాప్ యజమానులు, ఫార్మసీ విద్యార్థులు, పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన ఫార్మసీ విద్యార్థులకు ప్రశంసా పత్రం, బహుమతులు అందజేసి అభినందించారు.
మత్తుపదార్థాల చికిత్స కేంద్రం ప్రారంభం
మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో మత్తుపదార్థాల చికిత్స కేంద్రాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. మత్తుపదార్థల చికిత్స కేంద్రం పని విధానాన్ని, ల్యాబ్ లను, కౌన్సిలింగ్ ప్రదేశాన్ని, చికిత్స విధానాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వైద్యాధికారులతో సమీక్షించారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని, చెడు వ్యసనాలు అలవాటు పడిన వారిని తక్షణమే చికిత్స అందించి, సాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దాలని వైద్యులకు పిలుపునిచ్చారు.
మత్తు పదార్థాలకు బానిసైతే జీవితాలు చీకటి మార్గం వైపు పయనిస్తాయని, అలాంటి చెడు దారిని ఎన్నుకోకుండా యువత సన్మార్గం వైపు ప్రయాణించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతా దేవి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, డిసిహెచ్ డా:శివదయాల్ తదితరులు పాల్గొన్నారు.