ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రక్తదానంతో మరొకరి ప్రాణాన్ని నిలబెట్టవచ్చని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ప్రతి ఆరోగ్యవంతుడు రక్తదానం చేయాలని పిలుపు నిచ్చారు. రక్త దానం వల్ల జరిగే నష్టమేమి ఉండదని, మన శరీరంలో కావలసినంత రక్తాన్ని తయారుచేసుకునే శక్తి ఉంటుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో సమయానికి అవసరమైన రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రక్త దానం అలాంటి వారికి ఉపయోగపడి వారి ప్రాణాలను కాపాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, రక్తదానం వల్ల ఎటువంటి హాని ఉండదని వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కత్తి నరేందర్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.