ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి


పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో, విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచించారు. శుక్రవారం జిల్లాలోని కంది మండలం,కాశీపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (మైనార్టీ )ను,అంగన్‌వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించారు.
మొదట పాఠశాలలో తరగతి గదులు, వాష్‌రూములు, ఆవరణ పరిశుభ్రతను పరిశీలించిన కలెక్టర్, మధ్యాహ్న భోజన నాణ్యత ను పరిశీలించారు.మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అనే విషయాన్ని స్పష్టంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన కలెక్టర్ ప్రావీణ్య, పరీక్షలు దగ్గర పడుతున్నందున సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని, క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు.స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయా, సిలబస్ పూర్తి అయ్యిందా అనే అంశాలపై విద్యార్థుల నుండి వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని కృషితో ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని ప్రోత్సహించారు.
పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించిన కలెక్టర్ ప్రతి రోజు శుభ్రత తప్పనిసరిగా ఉండాల నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి మౌలిక వసతులు, పిల్లలకు అందిస్తున్న ఆహారం, మెనూ అమలు పరిస్థితులను పరిశీలించారు. చిన్నారులకు పంపిణీ చేసే షూలు అందరికీ చేరాయా? అనే వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.
తరువాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు . గ్రామంలో మంజూరైన ఇండ్ల సంఖ్య, నిర్మాణ దశలు, లబ్ధిదారుల ఖాతాల్లో నిధుల జమ పరిస్థితులపై ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈలతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లకు ఫోటో కాప్చరింగ్ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్, పంచాయతీ సెక్రటరీ, ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.