భవిష్యత్తులో టీఆర్ఎస్ గానే కొనసాగుతాం
రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే ఉంటా
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర
ముద్ర, మంచిర్యాల :
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి తాము రాజకీయంగా చాలా నష్టపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ప్రజల్లో బలంగా నాటుకుపోయిన గులాబీ జెండా, టీఆర్ఎస్ పేరుకు ఉన్న సెంటిమెంట్ విడదీయలేనిదన్న ఆయన మళ్లీ పార్టీని టీఆర్ఎస్ గానే చూడాలని, పాత పేరుతోనే ముందుకు సాగాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయం పై పార్టీ లో అంతర్గత చర్చలు జరుపుతున్నట్లు సంకేతాలిచ్చారు. ఆదివారం ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన, క్యాతనపల్లి నూతన మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, గత నిర్ణయాలపై ఆయన స్పందించారు. రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రజా సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతున్నట్లు చెప్పారు . ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ బలోపేతం చేయడమే తమ లక్ష్యం అన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.