Take a fresh look at your lifestyle.

పాలమూరు లో రెండు ముక్కలైన కాంగ్రెస్

– కార్పొరేషన్ ఎన్నికల తరువాత బయటపడిన అంతర్గత విభేదాలు
– మేయర్ ఎంపికలో రెండు వర్గాలుగా మారిన నేతలు… ఆనంద్ గౌడ్ కు మేయర్ పదవి ఇవ్వాలని డీసీసీ, పాలమూరు మాజీ డీసీసీ అధ్యక్షులు
– ఎమ్మెల్యే వర్గం నేతలు మాత్రం ఆనంద్ గౌడ్ కు ఇవ్వవద్దని అధిష్టానం పై ఒత్తిడి
– గెలిస్తే మేయర్ పదవి దక్కుతుందని వారిని ఓడించేందుకు డబ్బులు పంచారని ఆనంద్ గౌడ్ పై ఎమ్మెల్యే వర్గం ఆరోపణలు
– కాంగ్రెస్ అధిష్టానం గౌడ్ వైపే మొగ్గు… చివరకు ఎమ్మెల్యే యెన్నం బెట్టుతో దిగివచ్చిన కాంగ్రెస్ అధిష్టానం
– ఆనంద్ గౌడ్ ను కాదని ముదిరాజ్ వర్గానికి మేయర్ పదవి కట్టబెట్టి పట్టు సాధించిన ఎమ్మెల్యే యెన్నం
……………………………………..
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత మేయర్ ఎంపిక సమయంలో కాంగ్రెస్ లో రాజకీయ రణరంగమే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి తాను అనుకున్న వారికే మేయర్ పదవి కట్టబెట్టి పంతం నెగ్గించుకున్నారు ఇక్కడి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.అనంతరం రాజకీయ అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మేయర్ ఎంపిక తరువాత పాలమూరు కాంగ్రెస్ పార్టీ రెండు గా చీలిపోయింది. ఇంత కాలం ఒక్కటిగా ఉన్న కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలకు తెరలేపారు. కొందరు సీనియర్ నేతలు. మేయర్ ఎంపిక సమయంలో జరిగిన రసవత్తర రాజకీయం ప్రస్తుతం పాలమూరు లో హాట్ టాపిక్ అయింది.
మేయర్ ఎంపిక ముందు జరిగిన రాజకీయం ఇప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి చెందిన కొందరు నేతలు సొంత పార్టీ నేతలే తమ ఓటమికి కారణమని బాహటంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.37 వార్డు లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్పి వెంకటేష్ కూతురు నేహాశ్రీ కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్ గా పోటీలో ఉన్నారు. ఈమె ఇక్కడ విజయం సాధిస్తే మేయర్ పదవి దక్కుతుందనేది కాంగ్రెస్ పార్టీ లో టాక్ వచ్చింది. అలాగే 41 డివిజన్ లో కార్పొరేటర్ గా పోటీ చేసిన ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ భార్య స్వప్న కూడా మేయర్ పదవికి పోటీలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు గెలుపొందినా మేయర్ పీఠం దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ లో ప్రతి ఒక్కరూ అనుకున్నారు. 40 డివిజన్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ భార్య ప్రసన్న కార్పొరేటర్ గా కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. ఈమె గెలిస్తే కూడా మేయర్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక్కడే కాంగ్రెస్ మార్క్ రాజకీయం కనపడింది.37 డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి నేహాశ్రీ,41 డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న ఓటమి చెందారు. కానీ 40 డివిజన్ లో పోటీ చేసిన ప్రసన్న గెలుపొందింది. ఇక్కడే రాజకీయం రసవత్తర మలుపు తిరిగింది. నేహాశ్రీ, స్వప్న ఓటమి కి కారణం ఆనంద్ గౌడ్ అని ఎన్ పీ వెంకటేష్, లక్ష్మణ్ యాదవ్ బహిరంగంగా ఆరోపణలు చేశారు. నేహాశ్రీ, స్వప్న గెలిస్తే వారిద్దరిలో ఒకరికి మేయర్ పీఠం దక్కుతుందనే భావనలో ఆనంద్ గౌడ్ వారిద్దరి ఓటమి కుట్ర చేశారని వారు అంటున్నారు. వీరిద్దరి ఓటమి తో ఆనంద్ గౌడ్ భార్య ప్రసన్న కు మేయర్ పదవి ఖాయమని అందరూ అనుకున్నారు. కార్పొరేటర్లు శంషాబాద్ లోని రిసార్ట్ లో ఉంటే తమకే మేయర్ విషయం లో మద్దతు పలకాలని ఆనంద్ గౌడ్ వారికి డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం కాగా కొందరు నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆనంద్ గౌడ్ భార్య కు మేయర్ పదవి ఇవ్వాలని జిల్లా నేతలకు సూచించారు. అధిష్టానంతో పాటు డీసీసీ ప్రస్తుత అధ్యక్షులు , పాలమూరు మాజీ డీసీసీ అధ్యక్షులు , మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ప్రసన్న కే మేయర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ డబ్బులు పెద్ద మొత్తం లో మారాయనేది ప్రస్తుతం పాలమూరు లో బర్నింగ్ ఇష్యూ. మేయర్ పదవి ప్రసన్నకు ఇవ్వవద్దని ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమి కి కృషి చేసిన ఆనంద్ గౌడ్ భార్య ప్రసన్న కు మేయర్ పదవి ఎలా ఇస్తామని ఎమ్మెల్యే యెన్నం అధిష్టానం తో విబేధించారు. అధిష్టానం, కొందరు కాంగ్రెస్ నేతలు ఆనంద్ గౌడ్ భార్య కే మేయర్ ఇవ్వాలని పట్టుబట్టారు.దీంతో ఎమ్మెల్యే యెన్నం అధిష్టానం తీరు పై మండిపడ్డారు. అధిష్టానం ఎమ్మెల్యే పై ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన వారి ఒత్తిడి కి తలోగ్గకుండా ఎట్టి పరిస్థితి లో ప్రసన్న కు మేయర్ ఇచ్చేది లేదని, ఇది జరగకుంటే తాను ఎమ్మెల్యే పదవి వదులుకుంటానని కాంగ్రెస్ అధిష్టానం కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ సమస్య ఎక్కడికో వెళుతుందని అధిష్టానం భావించి మౌనం వహించిందని సమాచారం. ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేసి శంషాబాద్ లోని రిసార్ట్ లో ఆనంద్ గౌడ్ ను పోలీసుల అదుపులో ఉంచారు. మేయర్ ఎన్నిక సమయంలో గొడవ చేస్తారనే ముందస్తు సమాచారం మేరకు ఆనంద్ గౌడ్ ను పోలీసులు కట్టడి చేశారు. దీంతో ఆనంద్ గౌడ్ కొంత బయపడి వెనక్కు తగ్గారు.
ఇక ఇక్కడి నుంచే ఎమ్మెల్యే పావులు కదిపారు. తన ఆలోచన మేరకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధిక సంఖ్య లో ఉన్న ముదిరాజ్ లకు మేయర్ పదవి ఇచ్చారు. తొలి మేయర్ పదవి ముదిరాజ్ ఆడబిడ్డకు దక్కడం తో ఎమ్మెల్యే కు అ వర్గం నుంచి కొండంత మద్దతు వచ్చింది. ఎమ్మెల్యే పంతం నెగ్గించుకోవడం ఒక వంతైతే ముదిరాజ్ వర్గం లో సమిసిత స్థానం లభించింది. ఈ ఎన్నిక తో ఎమ్మెల్యే వర్గం ఒక వైపు, డీసీసీ అధ్యక్షులు, ఉమ్మడి పాలమూరు మాజీ డీసీసీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మరో వైపు కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారు. కార్పొరేషన్ ఎన్నికలకు ముందు వీరంతా ఒకే వర్గంగా ఉన్న వీరు ప్రస్తుతం చెరో దారి లో ఉన్నారు. ఎన్నికల తరువాత వీరంతా ఎమ్మెల్యే కు దూరంగా ఉంటున్నారు. సీనియర్ నేతలై ఉండి పార్టీ కోసం పని చేయకుండా ఓ వ్యక్తి కోసం పనిచేసారనే అపవాదు మూటగట్టుకున్నారు.ప్రస్తుతం పాలమూరు ఈ అంశాలన్నీ తెర పైకి రావడం తో కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత చర్చ మొదలైంది.

Leave A Reply

Your email address will not be published.