Take a fresh look at your lifestyle.

బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు

  • సిట్‌లో ఐజీ రమేష్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం
  • 90 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్న సిట్
  • కీలకంగా మారనున్న సిట్ నివేదిక
  • ఈడీ ఎంట్రీకి అవకాశం?

ముద్ర, తెలంగాణ బ్యూరో : బెట్టింగ్ యాప్స్ కేసుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ‌రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు పోలీస్ ఉన్నతాధికారులతో కూడిన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసింది. ఈ యాప్స్ కేసులను విచారించేందుకు సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్‌తో పాటు సభ్యులుగా ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్‌లను నియమిస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సిట్ మొత్తం 90 రోజుల్లో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పంజాగుట్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన కేసులను సిట్‌కు బదిలీ చేయనున్నారు. ఆన్‌లైన్ బెట్టింగును నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సైతం సిట్ ప్రభుత్వానికి సూచించనుంది. పేమెంట్ లకు సంబంధించిన వ్యవహారాలపై ఆర్బీఐకి సిట్ సూచనలను చేయనుంది. పంజాగుట్ట, సైబ‌రాబాద్‌, మియాపూర్ పోలీస్ స్టేష‌న్ల‌లో 25 మంది సెల‌బ్రిటీల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఇతర పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇదివరకే యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు నోటీసులను పోలీసులు జారీ చేశారు. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల సహా పలువురు విచారణకు హాజరై బెట్టింగ్ యాప్ వ్యవహారంపై పోలీసుల ప్రశ్నలు ఎదుర్కొన్నారు. తమపై నమోదైన కేసులు కొట్టివేయాలని సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయించగా, కోర్టులు ఆ పిటిషన్లను కొట్టివేస్తున్నాయి.

  • కీలకంగా మారనున్న సిట్ నివేదిక

రానున్న 90 రోజుల్లో ప్రభుత్వానికి సిట్ సమర్పించనున్న నివేదిక కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. అమాయకుల ప్రాణాలను బలిగొన్న బెట్టింగ్ యాప్స్ పై కొరడా ఝుళిపించాలని భావించిన ప్రభుత్వం ఐజీ రమేష్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయడంతో వీటి ప్రమోషన్ల కోసం పనిచేసిన యూట్యూబర్లు, ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్స్, పలువురు నటుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఈ కేసు తమ మెడకు ఏ విధంగా చుట్టుకుంటుందనే భయాందోళనలు వారిని వెంటాడుతున్నాయి. ఇన్‌ఫ్లూయెన్సర్స్ కు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఒక్కో యాడ్‌కు ఎంత మొత్తంలో తీసుకున్నారు, విదేశాల నుంచి డబ్బులు ఎలా బదిలీ అయ్యాయి, సినిమా నటులు ఎలా ఎంట్రీ ఇచ్చారు, వీటి ప్రమోషన్ల వెనుక స్థానిక సంస్థలేమైనా ఉన్నాయా, బెట్టింగ్ యాప్స్ కారణంగా చనిపోయింది ఎంతమంది, ఏ యాప్ వలన ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడారు? అనే అంశాలపై సిట్ ఆరాతీయనున్నట్లుగా తెలుస్తోంది.

  • ఈడీ ఎంట్రీకి అవకాశం?

బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఆర్‌బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా డబ్బును హవాలా ద్వారా విదేశాల నుంచి ఇన్ ఫ్లూయెన్సర్లకు, గేమ్‌లో గెలిచిన విజేతలకు బదిలీ చేసినట్టు తేలితే ఈడీ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారమే వస్తున్నాయా?, హవాలా కింద ఏమైనా డబ్బులు వచ్చాయా? అనే కోణంలో దర్యాప్తు చేయనుంది. ఈ నగదు బదిలీకి స్థానికంగా ఏజెన్సీలను ఏర్పాటు చేసుకున్నాయా? ఆ ఏజెన్సీలు ఏ రాష్ట్రం నుంచి పనిచేస్తున్నాయి, మిగతా డబ్బును విదేశాలకు ఎలా పంపుతున్నాయి, ఇందులో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించారనే వివరాలపై ఆరా తీసే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.