Take a fresh look at your lifestyle.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు

  • అక్రమంగా ఇసుక తరలించే వారిపై ఉక్కు పాదం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లాలో అక్రమ ఇసుక వ్యాపారం చేసేవారి పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు.మంగళవారం మధ్యాహ్నం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, తహసీల్దార్లతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలో 12 ఇసుక రీచ్ లు ఉన్నాయని,గృహ నిర్మాణాలు చేపడుతున్న జిల్లా ప్రజలకు మన ఇసుక వాహనం ద్వారా తక్కువ ధరకే ఇసుకను ఇంటివద్దకు సరఫరా చేస్తున్నామని తెలిపారు.మన ఇసుక వాహనం ద్వారా కాకుండా రీచ్ ల నుండి అక్రమంగా ఇసుక తరలించి జిల్లా ప్రజలకు,ఇతర జిల్లాలకు అధిక ధరకు అక్రమంగా రవాణా చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి రీచ్ కు ఎన్ఫోర్స్మెంట్ బృందం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.తహసిల్దార్, ముగ్గురు పోలీస్ సిబ్బంది ఒక రెవెన్యూ సిబ్బందితో ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రాత్రి,పగలు చూడకుండా రీచ్ ల పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని,అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి యజమాని పై కేస్ బుక్ చేయాల్సిందిగా ఆదేశించారు.ఎన్ఫోర్స్మెంట్ వాట్సాప్ గ్రూప్ పెట్టీ అందులో ఆకస్మిక తనిఖీ ఫోటోలు, సమాచారం ఎప్పటి కప్పుడు పెట్టాలని సూచించారు.

ఎన్ఫోర్స్మెంట్ బృందం ద్వారా ఒక ట్రాక్టర్ పట్టుకుంటే రూ. 500 టిప్పర్ పట్టుకుంటే రూ. 1000 బహుమానంగా ఇస్తానని ప్రకటించారు.ప్రతి మన ఇసుక వాహనానికి జి.పి.ఎస్.ట్రాకింగ్ సిస్టం పెట్టాలని,ఒక ట్రిప్ బుక్ చేసుకొని అంతకు మించి ఇసుక తరలించి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు.అలాంటి వాహనాలను సైతం సీజ్ చేయాలన్నారు.పెబ్బేరు మండలం రామన్నపేట,వీపనగండ్ల మండలం తుమ్కుంట రీచ్ ల నుండి ఎక్కువగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు.ప్రతి రీచ్ వద్ద సి.సి.కెమెరాలు,లైట్లు,ప్రచార ఫ్లెక్సీ లు, పెట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ అక్రమ ఇసుక వ్యాపారం పై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందాయని,రెవెన్యూ అధికారులతో కలిసికట్టుగా పనిచేసి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి ఆక్రణ ఇసుక రవాణాను అరికట్టేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. మండల పోలీస్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి అక్రమ ఇసుక రవాణాను అరికట్టి జిల్లా రెవెన్యూ పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.అదనపు కలక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు,డిఎస్పీ వేంకటేశ్వర రావు,ఆర్డీఓ సుబ్రమణ్యం, సి. ఐ లు,స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, తహశీల్దార్లు, మైనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.