ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు కార్యాలయంలో సోదా చేశారు. బయటి వారిని లోనికి, లోపల ఉన్న వారిని బయటికి వెళ్లకుండా తాళాలు వేసి సోదాలు నిర్వహిస్తున్నారు.పెద్దపల్లి రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. డీటీవో, ఎంవీఐ, ఏఎంవీఐ కార్యాలయాల్లో 12 మంది సిబ్బందితో పాటు పలువురు ఏజెంట్లు, ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ఆరా తీసినట్లు వెల్లడించారు. రూ. 60,450 నగదును స్వాధీనం చేసుకుని, అందుకు సంబంధించిన నివేదిక ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు క్రిష్ణకుమార్, తిరుపతి, పున్నం చందర్, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
