సింహ వాహన సేవలో భక్తులకు దర్శనం..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవర్ధనగిరిధారి అలంకార శేవలో ఆలయ తిరవీధులలో ఊరేగారు. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో సోమవారం 6వ రోజు ఉదయం ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని గోవర్ధనగిరిధారి అలంకార శేవలో అలంకరించి భక్తుల దర్శనార్ధం తిరువీధులలో ఊరేగింపు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలను శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారముగా ఆలయ ప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, అర్చకబృందం, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి జె. భవాని శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహామూర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు ఎమ్. హనుమంతరావులు స్వామివారిని దర్శించుకుని గోవర్ధనగిరిధారి అలంకార శేవ విశిష్టతను ప్రధాన అర్చకులు వివరించగా ఆలకించారు.

గోవర్ధనగిరిధారి అలంకార శేవ ప్రత్యేకత
శ్రీకృష్ణ భగవానుని యొక్క అనంత కళ్యాణ గుణములు ప్రకాశించిన చోటు గోవర్ధనగిరి పర్వతమే. భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమై సమస్త ప్రాణికోటికి భగవదనుగ్రహముతో ఆకలి దప్పికలను తీర్చిన పర్వత శ్రేష్టమే ఈ గోవర్ధన పర్వతము. తనను ఆశ్రయించిన భక్తులను రక్షించుట వారిని అందరిని తన వద్దకు రప్పించుకొని తన కటాక్షమును అందించుట పశువులు, పక్షులు, గోపబాలకులు సమస్త బృందావనంలోని
ప్రాణికోటి భగవంతుని ఆశ్రయించడానికి ఆధారమై నిలిచినది ఈ గోవర్ధనగిరి పర్వతము. ఈ వేడుక శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని గోవర్ధనగిరిధారిగా దర్శింపచేస్తూ, భక్తులను అనుగ్రహించు తీరు,భగవానుని యొక్క భక్త రక్షణ తత్పరతను సూచించుచున్నది.
సాయంకాలం సింహవాహన శేవలో భక్తుల దర్శనమిచ్చిన స్వామివారు
సోమవారం సాయంకాలం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం రాత్రి శ్రీ స్వామివారిని “సింహవాహన” శేవలో అలంకరించి తిరువీధులలో భక్తుల దర్శనార్ధం ఊరేగించారు. ఈ వేడుకను ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞచార్యులు,వేద పండితులు, అర్చక బృందం, పారాయణీకులు అత్యంత వైభవముగా ఊరేగింపు వేడుక నిర్వహించగా వేడుకలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సింహవాహనసేవప్రత్యేకత
సింహము మహా తేజశ్శాలి. సింహమునకు కేసరి, కంఠీరవం మొదలగు గొప్పనైన పేర్లు కలవు. సింహము కార్యదక్షతకు బుద్ధి కుశలతకు, పరాక్రమానికి, ధైర్యానికి, గాంభీర్యానికి, శీఘ్రగమనానికి, శత్రుసంహారానికి ప్రతీక. అందుకనే భగవానుడు స్వయంగా భగవద్గీత యందు మృగాణాం చ మృగేంద్రోహం అన్నాడు. నారసింహవపుః అని విష్ణుసహస్రనామావళి నరసింహ రూపం దాల్చిన మూర్తి అని భగవానుని కీర్తిస్తుంది. మానవ జీవనము అనే సంసార అరణ్యమునకు సంరక్షకుడు నరసింహస్వామి అని అభయప్రధాన హస్తముతో అమ్మవారు వెన్నంటిరాగ శ్రీ స్వామి వారు భక్తులను అనుగ్రహించుట ఎంతో అపూర్వతను సంతరించుకొనినది. శ్రీ నరసింహ రూపుడైన శ్రీ స్వామి వారు సింహ వాహనారూఢుడై భక్తులను అనుగ్రహించు తీరు విశేషమై ఉన్నది. బ్రహ్మోత్సవాలలో ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు (సాంస్కృతిక కార్యక్రమాలు) భక్తులను స్థానికులను అలరించాయి.


ధార్మిక సాహిత్య సంగీత మాసభలు..
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షికబ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య మసనచెన్నప్ప నరసింహావతారంపై ఒక గంటసేపు ప్రసంగించి ప్రేక్షకులను
ఆకట్టుకున్నారు. పోతన భాగవతంలోని పద్యాలను గొంతెత్తి పాడి వినిపించారు.
ప్రహ్లదునివలె నేటిబాలబాలికలు
సద్గుణాలను అలవర్చుకోవాలని
తెలిపారు. ప్రహ్లాదుని విష్ణు భక్తిగొప్పదని అతనిని రక్షించడానికి, విష్ణువే స్వయంగా
అవతరించాడని, భగవంతునికి కూడా భక్తులంటే ప్రేమ అని,
పాపాత్ములను శిక్షించడానికి
భగవంతుడు ఒక్కొక్క సారి
మహాపురుషులను కూడా
భూమి మీద జన్మింప జేస్తాడని ,
మహాపురుషుల అడుగు జాడల్లో
మనం నడిచి ,మనసంస్కృతిని
పరిరక్షించుకోవాలన్నారు.