యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: సింగరేణి రామగుండం ఓసిపి.త్రీ ప్రాజెక్టులో ఆదివారం జరిగిన ఒక ప్రమాదంలో, గుట్ట శ్రావణ్ కుమార్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక కార్మికులు తెలిపిన వివరాల ప్రకరం.. రెండవ షిఫ్ట్ లో విధులకు హాజరైన శ్రావణ్ కుమార్ పార్కింగ్ లో ఉన్న డిజిల్ బోజర్ వాహనాన్ని కింద కూర్చుని తనిఖీ చేస్తుండగా అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయి వాహనం ముందుకు రావడంతో, వాహనం తనిఖీ చేస్తున్న శ్రవణ్ కుమార్ ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, తీవ్రంగా గాయపడ్డాడు. కాగా గాయపడిన శ్రవణ్ కుమార్ ను తోటి కార్మికుల సహకారంతో సంబంధిత అధికారులు వెంటనే గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించగా, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) నాయకుల వత్తిడి మేరకు, ఆసుపత్రి వర్గాలు తాత్కాలిక చికిత్స అందించి, హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, జీవితకాలం ముగిసిన డీజిల్ బోజర్లను వినియోగించడం కారణంగానే నేడు మజ్దూర్ కార్మికుడు శ్రావణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారని, బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, ఏరియా ఉపాధ్యక్షులు వడ్డేపల్లి కుమారస్వామి, కార్యదర్శి గట్టు శ్రీనివాస్, ఇతర నాయకులు ఆరోపించారు. జీవితకాలం ముగిసిన వాహనాలను ఇతర యంత్రాలను ఉత్పత్తి ప్రమాణంలో వినియోగించరాదని అనేకమార్లు సంబంధిత అధికారులకు కోరినప్పటికీ, తమ విన్నపాలను పెడచెవిన పెడుతూ రక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని దుయ్యబట్టారు. జరిగిన ప్రమాదానికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకొని, జీవితకాలం ముగిసిన వాహనాలను, యంత్రాలను ఉత్పత్తి ప్రమాణాల్లో వినియోగించరాదని వారు యాజమాన్యాన్ని కోరుతున్నారు.
