Take a fresh look at your lifestyle.

కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమి ధారాదత్తానికి యత్నం- ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపణ

ప్రైవేట్ వ్యక్తులకు అడ్డదారిన రూ. 200 కోట్ల భూమి
అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలని బీఆర్ఎస్ నిర్ణయం

ముద్ర, రంగారెడ్డి :

కొహెడలో ఫ్రూట్ మార్కెట్ కోసం కేటాయించిన 200 ఎకరాల భూమిని అడ్డ దారిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఎల్బీనగర్ లో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ట్రాఫిక్ ఇబ్బందులను, పొల్యూషన్, ప్రజల ఆరోగ్యాలను, రైతుల శ్రేయస్సు కోసం, భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొహెడ లో 200 ఎకరాల్లో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మార్కెట్ నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సింది పోయి.. మార్కెట్ భూమిని అడ్డ దారిన అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రూ. 3వేల కోట్ల విలువ గల భూమిని సీఎం రేవంత్ రెడ్డి టీజీఐఐసీ ఇచ్చి అక్కడ నుంచి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సోమవారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని కొహెడలో ఫ్రూట్ మార్కెట్ కు కేటాయించిన స్థలంలో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొహెడ ఫ్రూట్ మార్కెట్ పరిరక్షణ, భూ బాధితుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఫ్రూట్ మార్కెట్ భూములను పరిశీలించారు. ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు హాజ‌రై మాట్లాడారు. ఈ భూ సేకరణలో భాగంగా మార్కెటింగ్ శాఖ ద్వారా సాగులో ఉన్న రైతులకు రూ.10 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం అందజేసినట్లు వివరించారు. 2020లో జీఓ 11 ఫ్రూట్ మార్కెట్ ను నోటిఫై చేస్తూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి జీఓ విడుదల చేశారని తెలిపారు. ఈ మార్కెట్ నిర్మాణానికి మార్కెటింగ్ శాఖ ద్వారా రూ. 350 కోట్ల నుబ్యాంకు ఖాతాలో జమ చేశామన్నారు. ఈ మార్కెట్ ను అనుసంధానం చేస్తూ ఫిష్, పూలు, కోల్డ్ స్టోరేజ్, రైతులకు విశ్రాంతి గదులు, విదేశాలకు వెళ్లే పండ్లు ప్యాకింగ్ వంటి అంశాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో రూ. వెయ్యి కోట్లతో డీపీఆర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. దళారుల కోసమో వ్యాపారుల కోసమో సీఎం పని చేయకూడదని హరీశ్ రావు చెప్పారు, రాష్ట్రం లో ఉండే లక్షలాది మంది పండ్లు పండించే రైతుల కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ హౌసింగ్ సొసైటీ (దిల్) భూమిలో జనాభా ప్రాతిపదికన తమ వాటా తమకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని, తెలంగాణ హై కోర్టులో కేసు వేశారన్నారు. ఈ కేసు లో థర్డ్ పార్టీ కి భూములు కేటాయించవద్దని హై కోర్టు ఆర్డర్ జారీ చేసిందనీ, కానీ ముఖ్య మంత్రి తన కమీషన్ల కోసం ఫ్రూట్ మార్కెట్ ను కోహెడలోని ఏపీ హౌసింగ్ సొసైటీ (దిల్) భూమిలోకి మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కడ భూములు ఖాళీగా ఉంటే వాటిని కాజేయాలని చూస్తుందన్నారు. అన్ని విధాలుగా రెడీగా ఉన్న ఫ్రూట్ మార్కెట్ ను చెట్లు, గుట్టల్లోకి తరలించడం అన్యాయమన్నారు. ఈ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం వల్ల రాష్ట్రంలో వేలాది మంది రైతులు లబ్ధి పొందుతారని, వేలాది మంది జీవనం సాగిస్తారని తెలిపారు. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందని, ఎంతోమందికి ఉపాధి లభిస్తుందన్నారు. కోర్టు కేసులు ఉన్న భూమి లోకి ఫ్రూట్ మార్కెట్ తరలిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎంత దూరమైన పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.