Take a fresh look at your lifestyle.

మద్యం ధరలు పెంపు..? త్వరలోనే నిర్ణయం

జ్యుడిషియల్ కమిటీకి నివేదిక
ప్రతిపాదనలు పంపిన కంపెనీలు
రిపోర్ట పై ప్రభుత్వం కీలక నిర్ణయం
వచ్చేనెల నుంచి ధరలు పెరిగే అవకాశం..?

రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా మందుబాబుల జేబులకు చిల్లు పడనుంది. గ్యాస్ కొరత, సీసాల ఉత్పత్తి తగ్గిపోవడం, ధరల సమీక్ష గడువు ముగియడం వంటి కారణాలతో ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే మద్యం ధరలు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో మద్యం ధరల పెంపు ఉండనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధం కాస్తా.. పశ్చిమాసియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గ్యాస్, ముడిచమురు రవాణాతోపాటు సప్లై చైన్‌కు అడ్డంకి ఏర్పడటంతో.. ప్రపంచ దేశాల్లో ధరలు పెరుగుతున్నాయి. ఈ కారణంగానే మన దేశంలో ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగాయి. ఇప్పుడు యుద్ధ ప్రభావం.. మద్యం ప్రియులకు కూడా చేదు వార్తను తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మందు బాబులకు షాకిచ్చేలా మద్యం ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. బీర్లతోపాటు మద్యం ధరలు కూడా వచ్చే నెలలో పెరగనున్నాయి.

ధరల పెంపు తప్పదా..?
పశ్చిమాసియా యుద్ధానికి తోడు రాష్ట్రంలో మద్యం ధరల పెంపు గడువు ఇప్పటికే పూర్తి కావడంతో మద్యం ధరల పెంపు తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ప్రతీ 2 ఏళ్లకు ఒకసారి రాష్ట్రంలో మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిసారిగా 2023 మే నెలలో తెలంగాణలో మద్యం ధరలను పెంచారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం మళ్లీ 2025 మే నెలలో ధరలను సమీక్షించాల్సి ఉన్నా.. ఆ గడువు ఎప్పుడో ముగిసిపోయింది. మరోవైపు.. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నేచురల్‌ గ్యాస్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దీంతో మద్యం సీసాల తయారీ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. అదే సమయంలో వాటి సరఫరా వ్యవస్థలో కూడా అంతరాయాలు ఏర్పడ్డాయి.

12 నుంచి 15 శాతం
ఈ నేపథ్యంలోనే నేచురల్ గ్యాస్ కొరత కారణంగా.. గాజు సీసా తయారీ యూనిట్లు తమ ఉత్పత్తిని కాస్త తగ్గించుకోగా.. కొన్ని యూనిట్లు పూర్తిగా మూసివేశారు. దీంతో దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి ఏకంగా 40 శాతం పడిపోయినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖాళీ సీసాల ధరలు ఏకంగా 20 శాతం వరకు పెరిగాయి. పెరిగిన అదనపు భారాన్ని తాము భరించలేకపోతున్నామని.. వెంటనే రాష్ట్రంలో మద్యం ధరలను పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. మరోవైపు.. మద్యం తయారీదారులు.. ఇటీవల ఎక్సైజ్‌ శాఖ అధికారులను కలిసి.. మద్యం ధరలను 12 శాతం నుంచి 15 శాతం వరకు పెంచాలని వినతి పత్రం కూడా అందించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల పెంపునకు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మద్యం ధరల పెంపుపై ఇప్పటికే కసరత్తు చేపట్టిన సర్కార్.. రిటైర్డ్‌ జడ్జితో కూడిన జ్యుడీషియల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ జ్యుడీషియల్ కమిటీ మద్యం ధరల పెంపు అంశాన్ని పరిశీలిస్తోంది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతోపాటు.. మద్యం తయారీ సంస్థల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ధరలు పెంపు తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మద్యం ధరల పెంపును 5 స్లాబులుగా విభజించి అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. బాటిల్‌ సైజ్‌ (90 ఎంఎల్, క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిల్).. బ్రాండ్‌ (తక్కువ ధర మద్యం, మద్యతరహా, ప్రీమియం బ్రాండ్స్‌).. ట్యాక్స్‌ స్లాబ్‌ స్ట్రక్చర్‌ ఆధారంగా చేసుకుని ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలోని కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో కొత్త ధరలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

బీర్లపై కీలకం
మరీ ముఖ్యంగా బీర్ల విషయానికి వస్తే.. గతేడాది ఫిబ్రవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను 15 శాతం పెంచింది. ప్రస్తుతం సీసాల కొరత, అల్యూమినియ క్యాన్ల ధరలు కూడా పెరగడంతో మళ్లీ బీర్ల ధరలను కూడా పెంచాలని కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అదే సమయంలో వేసవిలో బీర్లకు 30 శాతం వరకు అధికంగా డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో సరఫరా 20 శాతం తగ్గడంతో మార్కెట్‌లో బీర్ల కొరతకు దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొరత కనిపించకపోయినా.. బీర్ల సరఫరా మందగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా రూ.40 వేల కోట్లకుపైగా ఆదాయాన్ని సమకూర్చే మద్యం రంగంపై.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అధికారులను కలవరపాటుకు గురి చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.