- జూలై చివరి నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి.
- గ్రౌండింగ్ చేసిన ఇందిరమ్మ ఇండ్లను సెంట్రల్ యాప్ లో నమోదు చేయాలి.
- ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవంపై మండల అధికారులతో సమీక్ష.
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: గ్రామాలలో ప్రభుత్వ పాలన సజావుగా జరగాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.సోమవారం కలెక్టరేట్ లో ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవం, తదితర అంశాల పై మండల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండలంలో వన మహోత్సవం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పనుల కింద గుంతల తవ్వకం పనులు చేపట్టాలని, ఉపాధి హామీ పనుల క్రింద కనీస సరాసరి వేతనం 307 రూపాయలు ఉండే విధంగా చూడాలని కలెక్టర్ తెలిపారు. అవెన్యూ ప్లాంటేషన్ క్రింద తప్పనిసరిగా ఎత్తైన మొక్కలు మాత్రమే నాటాలని , మన నర్సరీలో లభించని పక్షంలో బయట నుంచి తెప్పించాలని అన్నారు. నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ డేట్ చేయాలని అన్నారు. జూలై చివరి నాటికి మొక్కలు నాటే ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఉపాధి హామీ క్రింద మంజూరైన పనులు గ్రౌండ్ చేసి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలో కనీసం 20 ఎకరాలను ఎంపిక చేసి కమ్యూనిటీ ప్లాంటేషన్ చేపట్టాలని అన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 5 చోట్ల సామాజిక ఇక్కడ గుంతల తవ్వకం చేపట్టాలని, వారం రోజులలో ఈ పనులను ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు . ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన తో లింక్ చేస్తుందని, దీనికి సంబంధించిన యాప్ లో సర్వే పనులు మరో 70 గ్రామాలలో పెండింగ్ ఉన్నాయని, ఈ గ్రామాలలో గ్రౌండింగ్ చేసిన ఇందిరమ్మ ఇండ్లను సెంట్రల్ యాప్ లో పంచాయతీ కార్యదర్శులు నమోదు చేయాలని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సహాయం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమల వ్యాప్తి జర్గకుండా పెద్ద ఎత్తున ఆయిల్ బాల్స్ వేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో రోడ్లపై చెత్త ప్లాస్టిక్ ఉండకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని అన్నారు.
మండలంలో ఉన్న సంక్షేమ హాస్టల్స్ లో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా పరిశీలించాలని అన్నారు. ఫ్రై డే డ్రై డే కార్యక్రమం పక్కాగా అమలు చేయాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో సీజనల్ వ్యాధులను నియంత్రణ పై అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల్లో ఉన్న మల్టీ పర్పస్ వర్కర్లకు మనమే ప్రిమియం చెల్లించి పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జేజేవై క్రింద బీమా తీసుకోవాలని, ఉపాధి హామీ కూలీలకు కూడా బీమా ఉండేలా చూడాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శుల క్షేత్రస్థాయిలో ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాళిందిని, పీడి హౌసింగ్ రాజేశ్వర్ రావు, జడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపిడిఓలు, మండల పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.