- కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నారు
- బీజేపీ ఎంపీ లక్ష్మణ్
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని అధికార కాంగ్రెస్ నేతలే ఒప్పుకుంటున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. హామీలతో ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అంగీకరించడం.. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందన్నారు. ఈ మేరకు గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు.. కాంగ్రెస్ మోసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని ఆయన మండిపడ్డారు.
తెలంగాణలోనే కాదు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలోనూ కాంగ్రెస్ మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీలంటే దగా, మోసమని ప్రజలు గ్రహించి హర్యానాలో ప్రజలు కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెట్టారన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ను ముంచేశారని, ఇప్పుడు ఢిల్లీలో దిక్కులేకుండా పోయేలా, డిపాజిట్లు గల్లంతయ్యేలా తీర్పు ఇవ్వబోతున్నారంటూ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. తెలంగామలో మార్పు బీజేపీతోనే సాధ్యమని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నామని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.