- 15 శాతం పెంపునకు త్రిసభ్య కమిటీ సిఫారసు
- ముందుగా బీర్లు.. ఆ తర్వాత లిక్కర్రేట్లలో మార్పులు
- ఫిబ్రవరి నుంచే కొత్త ధరలు..?
- ఇప్పటికే 19 శాతం పెంచాలని బేవరేజెస్ కంపెనీల డిమాండ్
- సరఫరా తగ్గించడంతో.. పెంపునకు ఆమోదం చెప్తున్న సర్కారు
- కేబినెట్లో చర్చించే అవకాశం
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. లిక్కర్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ప్రధానంగా బీర్ల ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం. బీర్ల ధరల పెంపు తర్వాత లిక్కర్ ధరలను కూడా పెంచనున్నారు. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసింది. అయితే, రాష్ట్రంలో మద్యం ధరలు పెంచొద్దని ముందుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఇటీవల యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ కంపెనీ కూడా బీర్ల సరఫరాను ఆపేసింది. ధరల పెంపునకు నిర్ణయం తీసుకోవడం లేదంటూ లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీర్లతో పాటుగా లిక్కర్ ధరల్లో మార్పులు చేయాలనే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. లిక్కర్ ధరలను సగటున 20 నుంచి -25 శాతం మేర పెంచేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
బీర్లపై 15 శాతం..?
ఫిబ్రవరి నెలలోనే మద్యం ధరలు పెంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ధరల సవరణలపై ఇప్పటికే అబ్కారీ శాఖ పూర్తి నివేదికను సిద్ధం చేసింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా మద్యం ధరలు పెంచాలంటూ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి నెల నుంచి మద్యం ధరలను పెంచాలనేది ఎక్సైజ్ శాఖ ప్రతిపాదన. బ్రాండెడ్ బీర్లు, బ్రాండెడ్ మద్యం, చీప్ లిక్కర్ ధరలు పెంచాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నది. ఈ ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి మద్యం ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్నది. దీనిపై సచివాలయంలో గత నాలుగైదు రోజులుగా ఎక్సైజ్ అధికారులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. వచ్చే నెల నుంచి అంటే ఫిబ్రవరి 1 నుంచి మద్యం ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రీమియం బ్రాండ్స్ అండ్ బీర్లపై 15% మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. చీప్ లిక్కర్ రేట్లను తక్కువ శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ నివేదిక ఇచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.ఆ తర్వాత లిక్కర్బాటిళ్లపైనా ధరలు పెంచనున్నారు. ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్‌పై రూ.10 -రూ.80 వరకు పెంచేలా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. చీప్ లిక్కర్ బ్రాండ్లపై తక్కువగా పెంపు ఉండనుండగా.. ఇతర బ్రాండ్లపై ఎక్కువ బాదుడు ఉండేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీంతో ఇటు ప్రభుత్వానికి కూడా ప్రతినెలా రూ.500 కోట్ల నుంచి రూ.700 మేర అదనపు ఆదాయం సమకూరే అవకాశం కూడా ఉంది.
అంచనాలు అందుకునేలా..!
ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుందని రేవంత్ సర్కార్ అంచనా వేసింది. ఏప్రిల్ -సెప్టెంబర్ వరకు తొలి 6 నెలల్లో ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్ ద్వారా రూ.8,040 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. అంటే తొలి 6 నెలల్లో రూ.17,533 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. అయితే, ఆ తర్వాత పండుగలు, డిసెంబర్ నెలలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఆదాయం పెరిగింది. ప్రస్తుతం మద్యంపై కొంత ఆదాయం తగ్గిన నేపథ్యంలో కొంత ధరలు పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్‌లు, పబ్‌ల ద్వారా ద్వారా రోజుకు సరాసరిగా రూ.90 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. నెలకు సగటున రూ. 2,700 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడిస్తున్నారు. లిక్కర్ రేట్లు పెంచితే ఆ ఆదాయనికి తోడు.. ప్రతి నెలా దాదాపు రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా.
భయపెట్టిన కంపెనీలు
రాష్ట్రంలో మద్యం ధరలు.. ప్రధానంగా బీర్ల ధరలు పెంచాలని కంపెనీలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర మద్యం మార్కెట్‌లో దాదాపు 60% వాటా ఉన్న మల్టీనేషనల్ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 30.1% అదనపు ధర చెల్లించాలని కోట్ చేసింది. ఈ కంపెనీ డిమాండ్‌నే మిగిలిన కంపెనీలూ అనుసరించాయి. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ కూడా 15 నుంచి 19 శాతం పెంచేందుకు నివేదిక ఇవ్వగా.. 15 శాతం బీర్ బేసిక్ ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిసింది. ఒక్క బీర్ల పెట్టె మీద 15 శాతం బేసిక్ ధర పెంచితే, దానికి కనీసం రూ. 250 నుంచి రూ. 280 వరకు వ్యాట్, ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రకాల పన్నులు జత కలుస్తాయి. దీంతో రూ.150 ఉన్న లైట్‌బీరు రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్‌బీరు ధర రూ.200 వరకు పెరగవచ్చని టీజీబీసీఎల్ అంచనా వేస్తున్నది. తాజాగా త్రిసభ్య కమిటీ నివేదిక, అబ్కారీ శాఖ ప్రతిపాదనలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.