Take a fresh look at your lifestyle.

ఎయిమ్స్ లో ఘనంగా ఓఆర్ఎస్ వారోత్సవాలు

బీబీనగర్, ముద్ర విలేకరి: బీబీనగర్ లోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ఓరల్ రీహైడ్రేషన్ లవణాలు (ఓఆర్ఎస్) వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఓఆర్ఎస్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ వారోత్సవం వివరాలను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రొఫెసర్ అహెంతం శాంతాసింగ్ వెల్లడించారు. పిల్లలలో అనారోగ్యం కారణంగా శరీరంలోని నీరు, లవణాలు కోల్పోయే ప్రమాదం వుంది. ముఖ్యంగా వాంతులు, విరేచనాల కారణంగా పిల్లలు ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురవుతుంటారు. ఈ పరిస్థితులలో వారికి సత్వర ఉపశమనం కలిగించేవి ఓరల్ రీహైడ్రేషన్ లవణాలు (ఓఆర్ఎస్), వీటి ప్రాముఖ్యతను వివరించేలా ఈ వారోత్సవాలను నిర్వహించారు. ఎయిమ్స్ ఈడీ అహంతెం శాంతా సింగ్ ఆధ్వర్యంలో, అకడమిక్స్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ నితిన్ అశోక్ జాన్ మార్గదర్శకత్వంలో, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్, డాక్టర్ అభిషేక్ జె అరోరా, పరిశోధనా విభాగం డీన్ ప్రొఫెసర్, డాక్టర్ సంగీత సంపత్, ఎయిమ్స్ పీడియాట్రిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్, డాక్టర్ సిబబ్రత్త పట్నాయక్ సారథ్యంలో జులై 25 నుంచి 29 వరకు ఓఆర్ఎస్ వారోత్సవాలను నిర్వహించారు. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రిలోని  ఔట్ పేషెంట్ విభాగానికి హాజరయ్యే సాధారణ ప్రజలను, అలాగే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న ఇన్‌పేషెంట్లు, రోగులను లక్ష్యంగా చేసుకుని వివిధ అవగాహన కార్యకలాపాలు నిర్వహించారు.డీహైడ్రేషన్ నివారణను తెలియజెప్పే లఘునాటికలు,  ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలన్నదానిపై శిక్షణ, ఆరోగ్య సంరక్షణ నిపుణులతో ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్‌లు ఏర్పాటు చేశారు. జులై 29న మంగళవారం జరిగిన ఓఆర్ఎస్ దినోత్సవంతో ఈ వారోత్సవాలు ముగిశాయి. ఓఆర్ఎస్ ప్రాముఖ్యతపై పలువురు నిపుణులు వివరించారు. అదనపు ప్రొఫెసర్ డాక్టర్ మధుసూదన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మనీషా వర్మ ఓరల్ రీహైడ్రేషన్ లవణాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.