Take a fresh look at your lifestyle.

30 ఏళ్లుగా గూడు కరువు -25వ వార్డులో దళిత కులానికి దక్కని ఇంటి స్థలాలు

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో నివసిస్తున్న దళితులకు ఇంటి స్థలం లేక గుడిసెల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వర్షాకాలంలో వారి జీవనం వర్ణనాతీతం. ఎన్నికలు వచ్చినప్పుడు నేతలు వస్తున్నారు ఓట్ల ఆశకు ఇళ్ల స్థలాలు హామీ ఇస్తున్నారు. ఎన్నికలు కాగానే పట్టించుకోవడంలేదని దళిత వర్గానికి చెందిన డక్కలి మిథున్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 మంది జనాభా గల డక్కలి వర్గానికి చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డక్కలి మిథున్ కుమార్ కు సంబంధించిన సామాజిక వర్గం మొత్తం ఇక్కడ నివాసం ఉంటుంది. వీరికి డబల్ బెడ్ రూమ్ కానీ ఇంటి స్థలం కానీ దక్కలేదు.

అధికారుల చుట్టూ ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో బోరున విలపిస్తున్నారు. మమ్మల్ని పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్న ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ ముద్దమల్లప్ప కుటుంబానికి చెందిన స్థలంలో శైలజ థియేటర్ పక్కన గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వీరు రాత్రి పడుకోవడమే గగనంగా మారింది. ప్రభుత్వ స్థలంలో ఎక్కడైనా స్థలం చూపించాలని ఓట్ల ప్రచారానికి వస్తున్న నాయకులతో మొరపెట్టుకొని కాళ్లు పట్టుకుంటున్నారు. వచ్చిన నాయకులందరూ మా వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నారు కానీ ఆ దళిత సంఘం వర్గానికి చెందిన వారికి నమ్మకం మాత్రం కలవడం లేదు. ఈసారైనా స్పీకర్ ప్రసాద్ కుమార్ కనికరించి ఇంటి స్థలాలను ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.