Take a fresh look at your lifestyle.

లేబర్ కోడ్స్, విత్తన–విద్యుత్ సవరణ బిల్లులు రద్దు చేయాలి

ముద్ర,తుర్కపల్లి:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్, విబిజి రామ్ జీ ఉపాధి చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తుర్కపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఎం.డీ.ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తెలుగు తల్లి విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలు అమలులోకి వస్తే కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఇప్పటివరకు లభిస్తున్న హక్కులు, చట్టపరమైన రక్షణలు, సంక్షేమ సౌకర్యాలు తగ్గిపోతాయని, యాజమాన్యాల అధికారం పెరిగి కార్మికులపై నిర్బంధం అధికమవుతుందని విమర్శించారు. ప్రశ్నించే కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
స్కీమ్ వర్కర్లు, గ్రామపంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులు నిర్వీర్యం అవుతాయని, హమాలీలు, ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులు కూడా ప్రశ్నార్థకంగా మారనున్నాయని అన్నారు.
విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని, ఇది అమలైతే రైతులపై కరెంట్ బిల్లుల భారం పెరిగి అప్పుల పాలయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. గతంలోలాగే రైతుల ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. జాతీయ విత్తన బిల్లుతో విత్తనాల ధరలు పెరిగే అవకాశం ఉందని, రాష్ట్ర విత్తన ఉత్పత్తి కేంద్రాలపై కేంద్రం పెత్తనం పెరుగుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ, రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా రోజువారీ వేతనాన్ని రూ.176గా నిర్ణయించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్, తూటి వెంకటేశం, గడ్డమీది నరసింహ, గ్రామపంచాయతీ యూనియన్ మండల అధ్యక్షుడు ఎరుకల స్వామి గౌడ్, అంగన్వాడీ యూనియన్ నాయకులు మరియు ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.