ప్రదర్శన – రాస్తారోకో…
4 లేబర్ కోడ్స్, విబి జి రామ్ జీ స్కీం, విద్యుత్తు సవరణ బిల్లు, విత్తన చట్టాలను వెంటనే రద్దు చేయాలి :
సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్, విబి జి రామ్ జి స్కీం, విద్యుత్తు సవరణ బిల్లు, విత్తన చట్టాలను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పురస్కరించుకొని సిఐటియు నాయకులు ఉదయం నుండి కొండమడుగు, బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమలను బంద్ చేయించి డాగ్ బంగ్లా నుండి బ్రాహ్మణపల్లి రోడ్డు అటు నుండి పోచంపల్లి రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించి చౌరస్తాలో అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ క్లియర్ కావడానికి చాలా సమయం పట్టింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రారెడ్డి మాట్లాడుతూ లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నదని యాజమాన్యాలకు, కార్పొరేట్ శక్తులకు యదేచ్ఛగా శ్రమ దోపిడీ చేసుకునేందుకు వీలుగా లేబర్ కోడ్స్ రూపొందించారని మండిపడ్డారు. స్వాతంత్ర్యంకు పూర్వం నుండి మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేసి సాధించిన 29 కార్మిక చట్టాలను పార్లమెంటులో మెజారిటీ ఉందన్న పేరుతో రద్దుచేసి 4 లేబర్ కోడ్స్ గా రూపొందించారని అన్నారు. ఈ లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే రోజుకు 8 గంటల స్థానంలో 12 గంటలు పని చేయాలని, కార్మికులు సంఘటితమై సంఘాన్ని పెట్టుకునే హక్కును గాని, తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కును గాని లేకుండా చేస్తున్నదని అన్నారు. నూటికి 90 శాతం మంది కార్మికులకు భవిష్యత్తులో ఎలాంటి కార్మిక చట్టాలు అమలు కాబోవని అన్నారు. అందుకు రానున్న కాలంలో కార్మిక వర్గం మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి, విబి జి రామ్ జీ స్కీంను తెచ్చి గ్రామీణ పేదలైన ఉపాధి హామీ కూలీలకు పనులు లేకుండా చేయనున్నదని అన్నారు. విద్యుత్తును ప్రైవేటీకరణ చేయడం కోసం పార్లమెంట్ లో విద్యుత్ సవరణ బిల్లు ఆమోదం చేసిందని తెలిపారు. ఇది అమల్లోకి వస్తే మన యాదాద్రి భువనగిరి జిల్లాలో పంపు సెట్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతాంగం ఇప్పటివరకు ఉచితంగా ఉన్న కరెంటు రానున్న కాలంలో బిల్లులు చెల్లించలేక రైతాంగం అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న 200 యూనిట్ల లోపు వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారులకు ఉచితం అనేది పోతుందని, కరెంటు చార్జీలు చెల్లించాల్సి వస్తుందని మొత్తంగా దేశ ప్రజల మీద పెనుబారంగా మారనున్నదని అన్నారు. దేశంలోనే మన హైదరాబాద్ విత్తన ఉత్పత్తి బండాగార కేంద్రంగా ఉన్నదని అన్నారు. ఇప్పుడు పార్లమెంటులో జాతీయ విత్తన చట్టం తీసుకొచ్చిందని అన్నారు. విత్తన ఉత్పత్తిలో దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు అవకాశం కల్పించిందని అన్నారు. లక్షల కోట్ల విలువచేసే జీవిత బీమా సంస్థలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100% పెట్టేందుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిందని అన్నారు. రానున్న కాలంలో పాలసీదారులకు తీరని నష్టం జరగనున్నదని అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాల్లో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొట్ట యాదమ్మ, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ ఉమర్, సిహెచ్ శ్రీనివాస్, మాజీ జిల్లా కమిటీ సభ్యులు గాడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు ఎరుకలి బిక్షపతి, రేసు రామచంద్రారెడ్డి, బాలబోయిన జంగయ్య, గ్రామపంచాయతీ యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు నాంపల్లి భాస్కర్, మంద యాదగిరి, స్టెర్లింగ్ స్టోనెక్స్ నాయకులు పలుగుల మునీశ్వర్ రెడ్డి, బాలరాజు, అంజయ్య, అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎస్కే షాహెద, శారద ధనలక్ష్మి, పద్మ, ఆశ యూనియన్ నాయకులు ఉడుత భవాని, గుర్రం బాలమణి, రాజ్యలక్ష్మి, సిహెచ్ అనిత, ఫీల్డ్ అసిస్టెంట్స్ నాయకులు బింగి నరసింహ, నాశపోయిన నరసింహ, లత, సునీత, మిషన్ భగీరథ నాయకులు జంగయ్య, కరుణాకర్, మధ్యాహ్న భోజనం నాయకులు వసంత, పద్మ లతో పాటు పాశం బాలయ్య, సిలివేరు రమేష్, మార్కండేయ, తాళ్ల అనూష, పావని, సరస్వతి, లావణ్య, సుజాత, రామారావు, లోక్దాస్ పవన్, బండారు భగత్, శివ తదితరులు పాల్గొన్నారు.