బాధ్యత మరువకుండా బతికపల్లి సమస్యలు తీరుస్తా..రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
ప్రత్యేక నిధుల ద్వారా రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తా..
ముద్ర న్యూస్, పెగడపల్లి:
ధర్మపురి నియోజకవర్గ ప్రజలు తనపై విశ్వాసం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు బాధ్యతగా పనిచేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికే పల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పెంట లక్ష్మీబాయి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలోని 149 గ్రామాల్లో బతికేపల్లి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని మంత్రి తెలిపారు. సుమారు 7వేల ఓటర్లు ఉన్న బతికే పల్లి గ్రామం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన నియోజకవర్గ ఓటర్ల సమస్యలే పరిష్కారం ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని మంత్రి తెలిపారు.
బతికే పల్లి గ్రామంలో రోడ్లు, మురుగు కాలువలు నిర్మాణంతో పాటు మహిళా సంఘాల భవన నిర్మాణం, కుల సంఘాల భవన నిర్మాణాలతో పాటు పల్లె దవాఖాన మరియు ఇతర మౌలిక వసతులు కల్పనకు తన వంతుగా సహకరిస్తానని మంత్రి వివరించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నిధులు కేటాయించి బతికేపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా గ్రామస్తులకు హామీ ఇచ్చారు.