మధిర, ముద్ర విలేఖరి : మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం వనం వారి కిష్ణాపురం గ్రామంలో అనర్హులను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొంతమందిని పంచాయతీ కార్యాలయంలో బంధించి తాళం వేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలానికి దాదాపు 550 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి.ఈ క్రమంలో మండలంలోని వనంవారి కిష్టాపురం గ్రామంలో ఇండ్ల లబ్ధిదారుల పేర్లను చదువుతుండగా అక్కడ ఉన్న గ్రామస్తులు ప్రభుత్వ ఉద్యోగులకు, ఇండ్లు ఉన్నవారికి వ్యవసాయ భూములు ఉన్న వారిని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ఎలా ఎంపిక చేశారని అగ్రహం వ్యక్తం చేస్తూ పంచాయతీ కార్యదర్శి తో పాటు కొంతమంది ఇందిరమ్మ కమిటీ సభ్యులను పంచాయతీ కార్యాలయంలో బంధించి తాళం వేశారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు, జిల్లా కలెక్టర్ గ్రామానికి వచ్చి పూర్తిస్థాయిలో విచారణ జరిపి అనర్హులను జాబితా నుంచి తొలగించి, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.