Take a fresh look at your lifestyle.

వరి బోనస్ పై రైతులకు రూ.25వేలు ఆదా మహిళలకు రూ. 57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చాం-అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీఆర్ఎస్ నేతలకు ఆడబిడ్డలపై ఏమాత్రం గౌరవం లేదు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రైతు భరోసా కాకుండా ఒక్కో రైతుకు వరి ధాన్యం బోనస్ పేరిట రూ.25వేలు ఆదా అవుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రైతుల శ్రమను గుర్తించి సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.ఐదొందల చొప్పున బోనస్ రైతుల ఖాతాలో వేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్లు వారి ఖాతాలో జమ చేశామన్న భట్టి.. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల కింద ఏడాదికి రూ. 20వేల కోట్ల పైగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు ఇప్పటివరకు వడ్డీ లేని రుణాల కింద రూ. 57 వేల కోట్లను మహిళల ఖాతాలో జమా చేశామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు మహిళలపై ఏమాత్రం గౌరవం ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. కేటీఆర్ ప్రతి సారి మహిళల మనసు గాయపరుస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ మహిళల గురించి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని సూచించారు. మహిళల అభివృద్ధి గురించి వారికి శ్రద్ధ ఉంటే వారి క్యాబినెట్లో మహిళలకు అవకాశం కల్పించేవారన్నారు. వడ్డీ లేని రుణాల గురించి కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. వడ్డి లేని రుణాలకు సంబంధించిన చెక్కులు చెల్లించుకుంటూ పోతున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామన్న భట్టి.. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అడ్డం కులు సృష్టించిన ముందుకు పోతూనే ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించిందన్న భట్టి.. మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. వీటి నిర్మాణం కోసం రూ. 22,500 కోట్లు మంజూరు చేశామనీ ఇది దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజా ప్రభుత్వం అమలు చేసుకుంటూ ముందుకు పోతుందని తెలిపారు. కానీ టిఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం, భూమిలేని పేదలకు వ్యవసాయ భూమి పంపిణీ హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.