Take a fresh look at your lifestyle.

డ్రగ్ ‘పైలట్’..? రోహిత్ రెడ్డే వ్యాపారి..?

రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
గతంలోనూ విచ్చలవిడిగా పార్టీలు
బడా వ్యాపారులకు డ్రగ్స్ తో వీకెంట్ పార్టీలు
పార్టీలు ఏర్పాటు చేసేది రోహిత్ రెడ్డే

ముద్ర, తెలంగాణ బ్యూరో :
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ పార్టీ కేసులో చాలా అనుమానాలు బలపడుతున్నాయి. మార్చి 16న కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు బాంబు పేల్చారు. పైలట్ రోహిత్ రెడ్డి పిలిస్తేనే అందరూ డ్రగ్స్ పార్టీకి వచ్చారని చెప్పారు. దీంతో ఆయనపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
హైదరాబాద్‌లో ఒక మాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ? పోలీసులు రేడ్ చేసి 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలర్ రోహిత్ రెడ్డే డ్రగ్స్ సప్లై చేశారా? రిమాండ్ రిపోర్ట్‌లో ఏ సంచలనాలు ఉన్నాయి? హైదరాబాద్, తెలంగాణ ప్రజలందరూ ఈ ప్రశ్నలతో షాక్ అవుతున్నారు. ప్రజా ప్రతినిధుల స్థాయిలో ఉన్నవారు ఇలా డ్రగ్స్ వ్యవహారాల్లో తలమునకలయ్యారనే ఆరోపణలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. యువత జీవితాల్ని నాశనం చేసే మత్తు పదార్థాల సప్లై వెనక నేతలే ఉన్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.

పైలట్ రోహిత్ రెడ్డి.. తాండూరు నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. చేవెళ్ల.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మార్చి 14 రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీమ్ దాడి చేసింది. పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. వారిలో పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ, ఏపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తదితరులు ఉన్నారు.

రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది?
మార్చి 16న కోర్టుకు ఈ కేసుపై రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. “పైలట్ రోహిత్ రెడ్డి పిలిస్తేనే అందరూ డ్రగ్స్ పార్టీకి వచ్చారు. వీకెండ్ డ్రగ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు రోహిత్ రెడ్డి ముందుగానే సమాచారం ఇచ్చారు” అని పోలీసులు వెల్లడించారు. ఫామ్‌హౌస్ స్విమ్మింగ్ పూల్ దగ్గర మద్యం, కొకైన్‌తో పార్టీ జరిగిందని ది న్యూస్ మినిట్ రిపోర్ట్ చేసింది. పోలీసులు స్వాధీనం చేసిన వస్తువుల జాబితాను ఇచ్చారు. 2 గ్రాముల కొకైన్, సిల్వర్ శరత్ కుమార్ దగ్గర లభించింది. జర్మనీలో తయారైన .32 కాలిబర్ రివాల్వర్. దీనికి రితేష్ రెడ్డి లైసెన్స్‌ కలిగివున్నారు. బుల్లెట్లు, ఖాళీ కార్త్రిడ్జ్‌లు, విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ పోలీసులపై 4 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిపాడని రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు.

డ్రగ్ పెడ్లర్ లా రోహిత్ రెడ్డి వ్యవహరించారా?
రోహిత్ రెడ్ స్వయంగా ఈ పార్టీని ఏర్పాటు చేశాడు. ఆయనే 10 మందిని పార్టీకి పిలిచాడని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కౌశిక్ రవి అనే వ్యక్తి సిమ్లా ట్రిప్‌లో అపరిచితుల నుంచి కొకైన్ తెచ్చాడని, ఒక్కో గ్రామ్‌కూ రూ. 15వేలు చెల్లించి కొన్నాడని, రోహిత్ డ్రైవర్ డబ్బు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. రోహిత్ రెడ్డి పిలుపుతోనే వీఐపీలు, వ్యాపారులు ఈ పార్టీకి వచ్చారు. ఇందులో రోహిత్ రెడ్డి డ్రగ్ పెడ్లర్ (డ్రగ్ వ్యాపారి)గా వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు ఉన్నాయి. పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతండ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారనీ, కొకైన్ వినియోగించారని రోహిత్ రెడ్డి మీద ఆరోపణలున్నాయి. డ్రగ్ టెస్ట్‌లో కొకైన్ వాడినట్లుగా పాజిటివ్ వచ్చింది. బీఆర్‌ఎస్ పార్టీ ఆయనను కార్యకలాపాల నుంచి బహిష్కరించి, వివరణ కోరింది. కాగా, రోహిత్ రెడ్డి ఇదివరకు పైలట్ ఉద్యోగం చేశారు. 2022లో బీజేపీ నాయకులు ఆయనపై డ్రగ్స్ ఆరోపణలు చేశారు.

డ్రగ్స్ పార్టీలు ఎప్పటి నుంచే నడుస్తున్నాయా..?
హైదరాబాద్‌ శివార్లలోని మొయినాబాద్‌లో రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో డ్రగ్స్ పాజిటివ్‌గా తేలిన వారికి గతంలోనూ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్, ఆయన స్నేహితుడు నమిత్‌శర్మలకు ఇటీవల నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో పార్టీలో వాడిన కొకైన్‌తో పాటు మరికొన్ని డ్రగ్స్ అవశేషాలు లభించడం సంచలనం రేపుతోంది. దాంతో వీరికి గతంలోనే డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని డ్రగ్స్ రిపోర్ట్ బలపరుస్తున్నాయి. దాంతో వీరి డ్రగ్స్ అలవాటుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పాల్గొన్న 11 మందిలో ఆరుగురికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్ శాంపిల్స్ లోనూ యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్‌ లభించాయి. ముఖ్యంగా పోలీసులపై కాల్పులు జరిపిన నమిత్‌శర్మ నమూనాల్లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్, కొకైన్‌ ఆనవాళ్లు గుర్తించారు. శనివారం నాటి పార్టీలో కేవలం కొకైన్ మాత్రమే వాడినట్లు ప్రాథమికంగా తేలినప్పటికీ, వీరి రక్తంలో ఇతర డ్రగ్స్ ఆనవాళ్లు ఉండటం చూస్తుంటే, వీరు గతంలోనూ ఇతర డ్రగ్స్ సేవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అసలు డ్రగ్స్ ఎంత తెచ్చారు..?
మరోవైపు, బెంగళూరుకు చెందిన కౌషిక్ రవి తాను శిమ్లా నుంచి రూ. 15 వేల విలువైన కొకైన్ తెచ్చానని ఒప్పుకున్నాడు. అయితే, పోలీసులు స్వాధీనం 0.26 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పాజిటివ్ గా తేలిన వారు అప్పటికే కొకైన్ వాడారని, కౌషిక్ రవి చెప్పిన దానికంటే ఎక్కువ మొత్తంలోనే డ్రగ్స్ తెచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే శిక్ష నుంచి తప్పించుకునేందుకు తక్కువ మోతాదులో డ్రగ్స్ తెచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు పాత రికార్డులను పరిశీలిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు.. మత్తు పార్టీలు!
ఒకరు బెంగళూరుకు చెందిన లాయర్, మరొకరు రాజస్థాన్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఏలూరు ఎంపీ, తాండూరు మాజీ ఎమ్మెల్యే ఇలా పలు రాష్ట్రాలు, పలు వృత్తుల్లో ఉన్నవారు మత్తు పార్టీలతో ఫ్రెండ్స్ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఓ మహిళ సహా 11 మందిని మొదట అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరంతా వేరే ప్రొఫెషన్ లో ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్ల కోసమే తరచూ కలుస్తుంటారని, ఈ క్రమంలో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.