Take a fresh look at your lifestyle.

Telangana Assembly: అట్టుడికిన అసెంబ్లీ

 

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ.. రచ్చ
బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య పేలిన మాటల తూటాలు
రాజీనామా సవాళ్లతో అట్టుడికిన సభ
ప్రజాప్రతినిధులందరూ డ్రగ్ టెస్టులు చేసుకోవాలి : టీపీసీసీ చీఫ్
రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిల విడుదలకు బీఆర్ఎస్ పట్టు
అసెంబ్లీ సెక్రటరీకి ప్రతిపక్షం వాయిదా తీర్మానం
కాంగ్రెస్ పాలనలోఅన్ని అంశాల్లో అవినీతి జరుగుతోందన్న కేటీఆర్
మహిళా సంఘాలకు రుణాలపై సంచలన వ్యాఖ్యలు
రూ. 57వేల కోట్ల రుణాలిచ్చినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
ఆరు గ్యారంటీల అమలుపై కేటీఆర్‌, మంత్రి కోమటిరెడ్డి మాటల తూటాలు
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు భవిష్యత్తుపై కేటీఆర్ అనుమానం
ఫార్మాసిటి భూములు ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేర్లతో మళ్లింపు కుట్ర
గ్లోబల్ సమ్మిట్లలో ప్రకటించిన పెట్టుబడులు, ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పుపై కేటీఆర్ అసహనం
నిరంకుశత్వానికి బీఆర్ఎస్ నేతలే బ్రాండ్ అంబాసిడర్ల అన్న పొంగులేటి
హ్యామ్ పేరిట రూ. 18వేల కోట్ల స్కాం జరిగిందన్న హరీశ్ రావు
అసలు టెండర్లే పిలవనప్పుడు అవినీతి ఆస్కారం ఎక్కడిది..? మంత్రి కోమటిరెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాజీనామా సవాళ్లతో దద్దరిల్లాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం శాసనసభలో పలు అంశాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. దీనికి అధికార పార్టీ సభ్యులు ప్రశ్నలు సంధించిన కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. సభ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఇరు పార్టీల సభ్యులు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో జరిగిన వాగ్వాదం, ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలపై ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మహిళా సంఘాల రుణాల విషయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంచలన సవాల్ విసిరారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.57 వేల కోట్ల రుణాలను మంజూరు చేసిందని పేర్కొన్నారు. అయితే, ఆ లెక్కలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ మహిళలకు రూ.57 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్డర్ కాపీని ఇప్పుడే సభలో చూపిస్తే.. తాను తన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒకవేళ అటువంటి ఆర్డర్ కాపీ లేకపోతే.. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు భట్టి విక్రమార్క తన డిప్యూటీ సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా.. అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సవాల్‌తో సభలో ఒక్కసారిగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గణాంకాల విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేటీఆర్ తనదైన స్టైల్లో ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల సంవాదం చోటుచేసుకుంది. హామీలు అమలు చేయనందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. అయినప్పటికీ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలపాలని పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు భవిష్యత్తుపై కేటీఆర్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. గ్లోబల్ సమ్మిట్లలో ప్రకటించిన పెట్టుబడులు, అవగాహన ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. టీఎస్-ఐపాస్ వెబ్‌సైట్ గత పదేళ్లలో అత్యంత పేలవమైన పనితీరును చూపుతోందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం 14వేల ఎకరాల్లో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని, ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ వంటి పేర్లతో మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఫార్మా కోసం షరతులతో కూడిన ఈ భూమిని ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్లాట్లు ఇవ్వడానికి, స్టేడియాలు, జూ పార్కులు నిర్మించడానికి ఉపయోగించలేరని ఆయన స్పష్టం చేశారు. ఫార్మా సిటీ రద్దు కాలేదని కోర్టుకు చెబుతూ, బయట మాత్రం దానిని ఫ్యూచర్ సిటీగా ప్రచారం చేయడంలో వైరుధ్యం ఉందని కేటీఆర్ అన్నారు. కాలుష్య కారక పరిశ్రమల మధ్యలో నివాస సముదాయాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలకు నమ్మకం ఎలా కుదురుతుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై కేటీఆర్ సభలో విమర్శలు గుప్పించారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు ఆయనకు కౌంటర్ ఇచ్చారు.
================
ఎమ్మెల్యేల అనర్హత తీర్పుపై బీఆర్ఎస్ నిలదీత.. కౌంటర్ ఇచ్చిన స్సీకర్, మంత్రి పొంగులేటి

సభలో ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల తీర్పు అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల స్పీకర్ ఘాటుగా స్పందించారు. తీర్పు కాపీ చదివి వచ్చి మాట్లాడాలని సూచించగా, కేటీఆర్‍కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీందో పార్టీ ఫిరాయింపుల అంశం సభలో హాట్ హాట్‍గా మారింది. ఈ క్రమంలో సభలో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని అంశాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. స్పీకర్‍ను ఉద్దేశించి మీరంటే నాకు మర్యాద ఉంది. కానీ తమరు కూడా మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేస్తే మీరు ఓ నిర్ణయం తీసుకున్నారు. మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది. మీరు నేను మిత్రులం అది అందరికీ తెలుసు. కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైతే తప్పకుండా ప్రశ్నించే అధికారం, హక్కు సభ్యుడిగా నాకు ఇక్కడ ఉంది. ఉంటుందన్నారు. మీ జ్యుడిషియల్ అథారిటీని మేము కాదనడం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం మా బాధ్యత. హైకోర్టులో కాకుంటే సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టు తీర్పుపై అవసరమైతే రివ్యూ పిటిషన్లు వేస్తామని ఇది న్యాయవ్యవస్థలో ప్రాసెస్ అన్నారు. దేశంలో ఆయారాం గయారామ్ సంస్కృతిని తీసుకువచ్చింది కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. అధికారం వచ్చిందని అహంకారంతో మాట్లాడవద్దని నేనేమి ఇక్కడికి ఊరికేనే రాలేదని నేను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వచ్చామన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. జ్యుడిషియరీ వ్యవస్థలో జడ్జి తీర్పు ఇస్తారన్నారు. కానీ మీరు జడ్జిమెంట్ చదవకుండానే నాపై ఎన్ని అభియోగాలు మోపారు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా జడ్జిమెంట్ చదివాక మాట్లాడితే మీకు నేను జవాబిస్తా. దయచేసి విషయంలో ప్రశ్నించడాన్ని తగ్గించుకుంటే మంచిదని సూచించారు.

నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు:

కట్టుకథలు అల్లుతున్న ప్రతిపక్ష నేత చివరకు జడ్జి స్థానంలో స్పీకర్ ను కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతుంటే వారు ఏ రకమైన అహంకారంతో ఉన్నారో అర్థం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. వీరి అహంకారాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారని చెప్పారు. అందుకే పదే పదే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే నాలుగు సార్లు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. మీరు చెప్పినవే నిజాలైతే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు, అంతకు ముందు పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని నిలదీశారు. ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకపోతే వాటికి కారణాలపై విశ్లేషించుకోకుండా కట్టుకథలు, మాటల గారడీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నిరంకుశం అని మాట్లాడుతున్నారని నిరంకుశానికి బ్రాండ్ అంబాసీడర్లు మీరు. దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? అని అని మండిపడ్డారు. పార్టీల ఫిరాయింపులను ప్రోత్సహించిందే మీరు కదా అని అన్నారు.
================
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ గళం..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ గళమెత్తింది. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి వాయిదా తీర్మానం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, జీపీఎఫ్ బకాయిలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చెల్లించాలని బీఆర్ఎస్ నేతలు తీర్మానంలో పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందక రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ లోపల, బయట రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
==========
హాట్ టాపిక్ గా ‘డ్రగ్స్’పై చర్చ

రాష్ట్రంలో బిస్కెట్‍లు, చాక్లెట్లలా గంజాయి, కొకైన్ దొరుకుతోందని ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపానికి కారణం పదేళ్లు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎసే అన్నారు.

కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారని ఇంతకన్న సిగ్గుచేటు ఉందా అని నిలదీశారు. మంగళవారం శాసనమండలిలో మాట్లాడిన ఆయన… డ్రగ్ టెస్టుకు సభానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అని ప్రకటించారు. మరి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ , బీఆర్ఎస్ యువనాయకుడు కేటీఆర్ కూడా ముందుకు రావాలని చాలెంజ్ విసిరారు. టెస్టులకు బీఆర్ఎస్ అంగీకరిస్తే రేపే ముహూర్తం అని మీరు ముందుకు వస్తే తాను సీఎంను ఒప్పిస్తానన్నారు. ప్రజాప్రతినిధులందరూ డ్రగ్ టెస్టులు చేసుకుని ఈ సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

బి-ఫామ్ లు అందుకున్న అందరికీ టెస్టులు:
కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి బీ-ఫామ్‍లు ఇచ్చిందో వారందరిని డ్రగ్ టెస్టుకు తీసుకువస్తామని అలాగే బీఆర్ఎస్ కూడా పార్టీ బి-ఫామ్స్ ఎవరెవరికి ఇచ్చిందో వారందరిని టెస్టులకు తీసుకురావాలన్నారు. ఫామ్ హౌస్ లో పట్టుబడింది మీ నాయకుడు కాదా? అలాంటి వారికి వత్తాసు పలకవద్దని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఈ కేసులో ఎంత పెద్దవాళ్లున్నా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పదేళ్లలో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ తెలంగాణను సిగ్గుతో తలవంచుకునే పరిస్థితికి బీఆర్ఎస్ తీసుకువచ్చిందని అన్నారు.

భయపడ్డది ఎవరో అందరికీ తెలుసు:
డ్రగ్స్ మాటెత్తగానే మీ నాయకుడి పేరు బయటకు ఎందుకు వస్తోంది? ఇవాళ సామాన్యులు తమ పిల్లలు ఈ మాదక ద్రవ్యాల నుంచి కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, పదేళ్లలో విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో గంజాయి, కొకైన్ సరఫరా అయిందని ఇది తాను ఆన్ రికార్డుగా చెబుతున్నానన్నారు. మీ మాజీ శాసనసభ్యులు డ్రగ్ తీసుకుని పట్టుబడితే ఇప్పటి వరకు ఆయనపై బీఆర్ఎస్ పార్టీ ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా డ్రగ్స్ తీసుకుంటే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు అని నిలదీశారు. మద్దుపదార్థాలతో అంధకారం చేసిన ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగల్ టీమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని దారికి తెస్తున్నారన్నారు. గతంలో టెస్టులకు రాకుండా భయపడ్డది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.
===============
ఆరు గ్యారంటీలేమయ్యాయి..? బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌
ఎన్నికల ముందు ‘దానకర్ణుడి’లా సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయకుండా ‘కుంభకర్ణుడి’లా నిద్రపోతోంది. నేనే రాజు.. నేనే మంత్రి’ అని మిడిసిపడ్డ వారు సంపద మూటగట్టుకుపోలేరు.

ఎన్నికల హామీ దస్త్రంపై సీఎం సంతకం చేశారని 2023 నాటి గవర్నర్‌ ప్రసంగంలో ఉంది. ఏళ్లు గడిచినా సీఎం సంకల్పం, చిత్తశుద్ధి ఏమైంది? తొలి క్యాబినెట్‌లోనే ఆరు హామీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. బహిరంగ వేదికపై సీఎం సంతకం చేసిన దస్త్రం ఏమైంది? సీఎం ఫైల్‌కే దిక్కు లేకపోతే కాంగ్రెస్‌ మాటలు ఎవరు నమ్ముతారు? ఇటీవల ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆ ఫైలు కూడా కాలిపోయిందా.? మాయమైన ఆ ఆరు గ్యారంటీల ఫైలును వెతికి పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ పాలనను మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘ఎగ్గొట్టు.. కూలగొట్టు.. చెడగొట్టు’ అన్న చందంగా ఉంది. గల్లీల్లో చెత్త కుప్పలు పేరుకుపోతుంటే, పాలకులు మాత్రం ఢిల్లీకి విమాన యాత్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు ‘నిల్’.. లూటిఫికేషన్లు ‘ఫుల్’. పెన్షనర్లకు టీఏ, డీఏలు రాక నరకయాతన పడుతున్నారు. గ్యారంటీ కార్డులు కాస్తా ఇప్పుడు ‘బాకీ కార్డులుగా’ మారి వెక్కిరిస్తున్నాయి. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ప్రభుత్వం ఇతర అంశాలపై దృష్టి పెడుతోంది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో బీఆర్ఎస్ తరపున ‘ప్రైవేట్ మెంబర్ బిల్’ ప్రవేశపెడతాం. ప్రభుత్వం ఇప్పటికైనా మాట నిలబెట్టుకుని రైతులు, మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి. కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ వెళ్లి నిధులు తెస్తారనుకుంటే.. నిధులు ఇచ్చి వస్తున్నారు.. 2023లో ఐటీ ఉద్యోగుల సంఖ్య 9.46లక్షలు. తాజాగా గవర్నర్‌ ప్రసంగంలో ఆ సంఖ్య 9.39లక్షలుగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 7వేల ఉద్యోగాలు తగ్గాయనేది వాస్తవమా? కాదా? ఉద్యోగాలు ఎందుకు తగ్గాయి ? బీఆర్‌ఎస్‌ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తక్కువగా వచ్చినా రాష్ట్రాన్ని దీటుగా నిలబెట్టాం. మనది కేంద్రంపై ఆధారపడే రాష్ట్రం కాదు.
======================
ఢిల్లీ నుంచే మా రాజకీయం : మంత్రి శ్రీధర్ బాబు
మాది జాతీయ పార్టీ. ఢిల్లీ నుంచే రాజకీయం ఉంటుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల తీసుకువచ్చేందుకు ఎన్ని సార్లైనా ఢిల్లీ వెళ్తాం. ఎన్ని సార్లైనా ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలుస్తాం.

మీది ప్రాంతీయ పార్టీ. మీరు పదేళ్లు అధికారంలో ఉండగా అధికారం కాపాడుకునేందుకు ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లలేదు..? గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వానికి కేటీఆర్ ఏదైనా సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నా. కానీ అదే ఊక దంపుడు ఉపన్యాసాలు, ఎవరో రాసిన స్క్రిప్ట్ ను ఇక్కడ చదివి వినిపిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఢిల్లీకి వెళ్లకుండా జిద్దు రాజకీయం చేయాలా? రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం మేము ఓ మెట్టు దిగైనా ప్రయత్నిస్తున్నాం. కేంద్రం ఇస్తుందా లేదా అది వారి ఇష్టం. కానీ మా ప్రయత్నం కొనసాగిస్తాం. మంత్రిగా పని చేసిన అనుభవం కలిగిన కేటీఆర్ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. మమ్మల్ని ప్లాప్ అయిన సినిమా అంటున్నారు. ప్లాప్ అయింది మేము కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత లోక్‍సభ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ప్లాప్ అయింది మీరే. ఇన్నిసార్లు ప్లాప్ అయిన మీరు మమ్మల్ని ప్లాప్ అంటున్నారా..? ఇకనైనా వాస్తవాలు మాట్లాడాలి. అప్పుడే వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా కనీసం ప్లాప్ నుంచి తప్పించుకుని కాస్త మెరుగు పడే అవకాశం ఉంది. అంతే తప్ప వింటున్నామని కాదా అని తిట్టడమే పనిగా పెట్టుకోవడం సరికాదు.
================
బీఆర్ఎస్ పదేళ్లలో ఎందుకు చేయలేదు..? : మంత్రి సీతక్క
ప్రతిపక్ష నేత కేటీఆర్ ప్రభుత్వంపై నిండు సభలో మహిళా సంక్షేమంపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పని చేస్తోంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రతిపక్షాలు ఎగతాళి చేయడం సరికాదు. మేము చేస్తున్న పనులను పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయింది? మొదటి నుంచి కేటీఆర్‌కు మహిళలంటేనే చిన్నచూపు. అందుకే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను జీర్ణించుకోలేక నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. బాధ్యత గల ప్రతిపక్షంగా దీనికి సహకరించాలి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ. 57 వేల కోట్లకు పైగా రుణాలను మంజూరు చేశాం.
===================
సీఎంకు ఆయన శాఖలో ఏం జరుగుతుందో తెలియదు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్ పోలీస్ కమిషనర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆయనకు జల్సాలు ఎక్కువయ్యాయి. ప్రైవేట్ వ్యక్తులకు ఆయుధాలు ఇచ్చి కాల్పులు జరిపిస్తున్నారు. గడతేడాది సెప్టెంబర్ లో కరీంనగర్ ఫైరింగ్ రేంజ్‌లో సీపీ సతీమణి, ఆమె ఐదుగురు మిత్రులతో కలిసి 10 రౌండ్లు కాల్పులు జరిపారు.

ఏకే-47, పిస్టల్స్‌తో సుమారు 160 బుల్లెట్లను ప్రైవేట్ వ్యక్తులు ఎలా వాడతారు… ? బోనాలపల్లిలో అమృతమ్మ అనే వృద్ధురాలికి బుల్లెట్ తగిలింది. కానీ ఆమె రాయి తగిలిందని భావించింది. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ఆయన శాఖలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నేను చెప్పింది తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా. మరి ఇప్పుడు ఐపీఎస్ అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదు. వికాస్ అగర్వాల్ అనే అధికారి ప్రైవేట్ వ్యక్తికి ఇన్నోవా వాహనం ఇచ్చి పంపారు. ఇలా కొందరు అధికారులతో మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తుంది. సీపీ.. నన్ను బెదిరించలేదు. నేను భయపడే వ్యక్తిని కాదు. ఆయనకు ఇంటెలిజెన్స్ ఉంటే, మాకు లక్షలాది మంది కార్యకర్తలు సమాచారం ఇస్తారు.
============
పార్టీ మారే ఆలోచన తెచ్చిందే సంజయ్ : మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
నేను కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయం. ఆల్రెడీ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. రెండు, మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా. మెజార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ పార్టీని వీడితేనే మంచిదని చెప్పారు. వారి సూచనలు, అభిప్రాయాలను గౌరవిస్తా. నేను పార్టీ వీడతానని ఎప్పుడూ.. ఎక్కడా.. చెప్పలేదు.

అసలు ఆ ఆలోచన రావడానికి కారణం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడంతోనే జిల్లాలో చిచ్చు రేగింది. 2014లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ప్రజల హక్కుల కోసం పోరాడా. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ ప్రజల అభివృద్ధి హక్కును సాధించలేకపోతున్నారు. వక్రమార్గాన వెళ్తే ప్రజలు ఎన్నటికీ హర్షించరు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలో ఉంటూ తనతో కలిసి పనిచేయాలంటూ సంజయ్ చెప్పడం విడ్డూరంగా ఉంది. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలి. అసలు ఆయనది ఏ పార్టీ.. స్పీకర్ ఏమో ఆయన బీఆర్ఎస్‌లో ఉన్నారని అంటున్నారు. సంజయ్ ఏమో కాంగ్రెస్‌లో కలిసి పనిచేద్దాం అంటున్నారు. నేను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం ఎమ్మెల్యే సంజయ్‌. ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న. కాంగ్రెస్‌ పార్టీతో తనది 40 ఏళ్ల బంధం ఉంది. ఎంత ఒత్తిడి ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో అర్థం చేసుకోవాలి.
===============
జగ్గారెడ్డికి పీసీసీ ఇస్తే వంద సీట్లు ఖాయం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి తరహాలో జగ్గారెడ్డికి ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం ఉంది. ఆయన ‘మరో పీజేఆర్’. ఒకవేళ జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా 100 సీట్లు గెలుచుకుంటుంది. హ్యామ్ రోడ్ల టెండర్లలో రూ.18 వేల కోట్ల కుంభకోణం జరిగిందన్న మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపణల్లో వాస్తవం లేదు. అసలు అన్ని కోట్ల రూపాయల టెండర్లే పిలవనప్పుడు, అవినీతి జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదం.
=============================
కేసీఆర్ గొప్ప అనుభవజ్ఞుడు.. : మంత్రి శ్రీధర్ బాబు
కేసీఆర్ గొప్ప అనుభవజ్ఞుడు.. ఆయన సభకు రావాలి. ఆయన సలహాలు సూచనలు స్వీకరిస్తాం. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనేది ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. నామినేటెడ్ పదవులపై కసరత్తు జరుగుతోంది. పోర్ట్ ఫోలియోల కేటాయింపులపై సీఎందే తుది నిర్ణయం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విషయంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చొరవ చూపాలి. జీవన్ రెడ్డి పార్టీ మారొద్దని నేను కోరుతున్న. జగ్గారెడ్డి అంటే అందరికీ ఇష్టమే.. పీసీసీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన మనసులోని మాట చెప్పారు. పీసీసీ పదవిపై అధిష్టానానిదే తుది నిర్ణయం.
================
60లక్షల మందికి పైగా మందికి రైతుభరోసా : ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌
ఈనెల 22 నుంచి రైతుభరోసా నిధులు పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో 60లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులు వరి వేస్తే ఉరి అన్నారు. సన్న బియ్యం పండించే రైతులకు రూ.500 బోనస్‌, యంత్ర పరికరాలు అందిస్తున్నాం. రైతులు, ప్రజల మద్దతుతో మున్సిపల్‌, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం దక్కింది. అసత్య ప్రచారం చేస్తోన్న బీఆర్‌ఎస్‌ నేతలను ప్రజలు విశ్వసించరు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా 71.86లక్షల టన్నుల ధాన్యం పండించాం. ఎల్లంపల్లి నీటితో పెద్ద ఎత్తున వరి పండింది. బీఆర్‌ఎస్‌ హయాంలో మోటార్లకు కూడా బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. గత ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఇందిరమ్మ రాజ్యం నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ సేవలందిస్తున్నాయి.
===============
హ్యామ్ పేరిట రూ. 18వేల కోట్ల స్కాం : మాజీ మంత్రి హరీశ్ రావు
రాష్ట్రంలో హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌) రోడ్ల పేరిట రూ.18వేల కోట్ల స్కామ్‌ జరుగుతోంది. హ్యామ్‌ రోడ్లకు 10శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇస్తున్నారు. హ్యామ్‌ రోడ్ల ద్వారా కాంగ్రెస్‌కు వేల కోట్లు వస్తాయి. ఈ కమీషన్లను 4 రాష్ట్రాల ఎన్నికలకు పంపుతారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేయాలి. సీవోటీ అనుమతి.. 5 శాతం సీలింగ్‌ తప్పనిసరి చేయాలి. మొబిలైజేషన్‌ అడ్వాన్సులు రద్దు చేయాలి. ఈ కుంభకోణంపై హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలి. సీవీసీ, ఆర్బీఐ సహా అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
================

Leave A Reply

Your email address will not be published.