దశాబ్దాల కేరళ విజయాలు ఎల్.డీ.ఎఫ్ ప్రభుత్వాల కృషి ఫలితాలు
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు కేరళ అడుగులు
కేరళలో అతితక్కువ అవినీతి
6వ అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా తెలంగాణ
అత్యంత పేదరికం లేని ఏకైక రాష్ట్రంగా కేరళ
కేంద్ర సమాఖ్య వ్యతిరేక విధానాలపై సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం
మైనారిటీల హక్కుల కోసం, రాజ్యాంగ విలువల కోసం రాజీలేని పోరాటం
సీఎం రేవంత్ రెడ్డికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ
కేరళ :
నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎస్డీజీ ఇండెక్స్ 2023-24లో 79 పాయింట్లతో కేరళ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. అదే ఇండెక్స్ లో తెలంగాణ ఆరో స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు. కేరళ సాధించిన ఈ విజయాలు దశాబ్దాలుగా ఎల్.డీ.ఎఫ్ ప్రభుత్వాలు చేసిన కృషితోనే సాధ్యమయ్యాయని, ఇందులో కాంగ్రెస్ గొప్పదనం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం.. దేశంలోనే అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ అన్న విజయన్… తెలంగాణ 6వ అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా ఉందన్నారు. కేరళ ప్రభుత్వ పనితీరుపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై విజయన్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి పేరిట బహిరంగ లేఖ విడుదల చేశారు. రాజకీయ విబేధాలను పరిష్కరించుకోవడానికి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని ఆయన రేవంత్‌కు హితవు పలికారు. గతేడాది నవంబర్ ఒకటో తేదినాటికి అత్యంత పేదరికం లేని ఏకైక రాష్ట్రంగా కేరళ అవతరించిందని విజయన్ గర్వంగా ప్రకటించారు. 64,006 కుటుంబాలను గుర్తించి, వారికి ప్రత్యేక మైక్రో-ప్లాన్ల ద్వారా ఉపాధి, ఆసరా కల్పించామని వివరించారు. కేరళ తన 2026 ఐటీ పాలసీ ద్వారా భారత ఐటీ ఎగుమతుల్లో 10శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం ద్వారా కేరళ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కేరళ ఇప్పుడు అగ్రస్థానంలో ఉందని, పారిశ్రామిక స్తబ్దత ఉందన్న రేవంత్ వ్యాఖ్యలు అవాస్తవమని కొట్టిపారేశారు. అదే సమయంలో బీజేపీతో తాను మెతకగా ఉంటున్నానని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను విజయన్ ఖండించారు. కేంద్రం అనుసరిస్తున్న సమాఖ్య వ్యతిరేక విధానాలపై సుప్రీంకోర్టులో రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నది కేరళ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. మైనారిటీల హక్కుల కోసం, రాజ్యాంగ విలువల కోసం తమ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేరళకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి అనేక ప్రాజెక్టుల విషయంలో మొండిచేయి చూపిందన్నారు. కొచ్చి మెట్రో వంటి ప్రాజెక్టులను ఆలస్యం చేసిందని విజయన్ ఆరోపించారు. లేఖ చివరలో విజయన్ మలయాళంలో ఒక శక్తివంతమైన వ్యాఖ్య చేశారు. “మేము ముందుకు వెళ్తాము.. కేవలం ముందడుగు మాత్రమే వేస్తాం. ‘నవ కేరళ’ నిర్మాణంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తాం. రాజకీయ విమర్శలు చేసేటప్పుడు భాషా సంస్కారం ఉండాలని, హద్దులు దాటి మాట్లాడటం సరికాదని రేవంత్ రెడ్డికి పినరయి విజయన్ ఈ లేఖ ద్వారా సూచించారు.