- గృహ నిర్మాణ శాఖ ప్రతిపాదనలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం.
- ఈనెల 20 నాటికి నోటిపికేషన్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దశలవారీగా ప్లాట్లు, టవర్లు, ఖాళీ స్థలాలను అమ్మాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఈనెల 20 నాటికి విక్రయ నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల నిధుల సమీకరణకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ సందర్భంగా శనివారం గృహ నిర్మాణ కమిషనర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మొత్తం 11 ప్రాంతాలలో నిర్మాణం పూర్తయిన, పాక్షికంగా పూర్తయిన అపార్ట్‌మెంట్లు, ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు, హౌసింగ్ బోర్డు పరిధిలోని మరో 4 ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్లు, ఇతర ఖాళీ స్థలాలను కూడా బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టనున్న ఈ విక్రయాల ద్వారా ఎలాంటి వివాదాలు లేని, స్పష్టమైన యాజమాన్య హక్కులు కలిగిన ఆస్తులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని కమిషనర్ గౌతమ్ అభిప్రాయపడ్డారు. రాజీవ్ స్వగృహకు సంబంధించినంత వరకు పోచారం, గాజులరామారం, ఖమ్మం పోలేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లలో ఒక్కో దానిలో సుమారు 100 నుంచి 150 ప్లాట్లు ఉన్న టపర్ యూనిట్ ఏక మొత్తంగా విక్రయించనున్నారు.