తెలంగాణ ప్రజలు అవమానాన్ని భరించరు
అమరవీరుల స్ఫూర్తితో మీరందరూ విధులు నిర్వర్తించాలి
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి
టీజీపీఎస్‌సీని ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టాం
కొందరు ఉద్యోగాలను అమ్ముకున్నామని మాపై తప్పుడు ప్రచారం చేశారు
వారికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు
మీ ఉద్యోగాల కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడింది
ఉద్యోగంలో గరం…నరం.. బేషరం రకాల మనుషులుంటారు
మీరంతా మొదటి పరిస్థితి దగ్గరే ఆగిపోతే మంచిది
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత
త్వరలో అసెంబ్లీలో చర్చించి చట్టం తీసుకువస్తాం
గ్రూప్–1,2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ.. అవమానాన్ని భరించరని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాకతీయులపై వీరోచితంగా పోరాడినా సమ్మక్క – సారలమ్మలు దేవతలు అయ్యారన్న ఆయన నిరంకుశ నిజాంపై తిరుగుబాటు చేసిన చరిత్ర తెలంగాణ నేలకుందని చెప్పారు. ఇక సాయుధ రైతాంగ పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం,స్వేచ్ఛ,సమాన అవకాశాల కోసం వారు అమరవీరులు అయ్యారన్నారు. అలాంటి వీరుల స్ఫూర్తితో నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని గ్రూప్ 1, 2 ఉద్యోగులకు సీఎం పిలుపునిచ్చారు. 6 లక్షల మంది పోటీపడితే 582 మంది గ్రూప్ 1,775 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గ్రూప్–1, గ్రూప్–2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీజీపీఎస్‌సీని ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా టీ జీ పీ ఎస్ సీ ని ప్రక్షాళన చేశామన్నారు. అందులో గ్రూప్ పరీక్షలపై అవగాహన ఉన్న వాళ్లను చైర్మన్ గా,సభ్యులుగా నియమించామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో లాగా ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా అత్యంత కఠినంగా పరీక్షలు నిర్వహించామన్నారు. తాము ఇంత పక్కాగా ఉన్నా.. కొందరు ఉద్యోగాలను అమ్ముకున్నామని తమపై తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. అలాంటి వారికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క గ్రూపు-1 ఉద్యోగం అయినా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 15 ఏళ్ల పాటు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆరోపించారు. కానీ ప్రజా ప్రభుత్వం గ్రూప్ 1 నిర్వహించి ఆకాంక్షలను నెరవేర్చిందని చెప్పారు. గ్రూప్ 1 నికి ఎంపికైన ఆనందం 24 గంటలు లేకుండా గిట్టని వాళ్లు కొందరు కోర్ట్ కు వెళ్లారని సీఎం ఆరోపించారు. అభ్యర్థులు ఒక్క తప్పు చేయలేదు.. మెరిట్ మీద ఎంపిక అయ్యారని ప్రభుత్వం భావించి సుప్రీంకోర్టు వరుకు వెళ్లి కొట్లాడిందని వివరించారు. శిక్షణ పూర్తిచేసుకున్న అధికారులు అందరూ ఉద్యోగంలో నిబద్ధత కనబర్చి… నాలుగు కోట్ల ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి అప్రోచ్‌తో ఉద్యోగంలో చేరారో రిటైర్మెంట్ వరకూ అలాగే ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగంలో మూడు రకాల పరిస్థితులు ఎదురవుతాయి. గరం…నరం.. బేషరం.. మీరంతా మొదటి పరిస్థితి దగ్గరే ఆగిపోతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గరం, నరం, బేషరం అనే నానుడి తప్పు అని మీరంతా ప్రూవ్ చేయాలని చెప్పారు.

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత
పేదవారికి సాయం చేసే ముందు తల్లితండ్రులను గుర్తు పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు సూచించారు. తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో 10 నుండి 15 శాతం కోత పెట్టేలా అసెంబ్లీ లో చట్టం చేయబోతున్నామని ప్రకటించారు. ఈ విషయంపై త్వరలోనే హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంసీహెచ్ఆర్ డీ మధ్య ఒప్పందం జరగబోతోందని సీఎం చెప్పారు. చట్టం గురించి హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పలువురు వచ్చి ఎంసీహెచ్ఆర్డి లో ఉద్యోగులకు శిక్షణ ఇస్తారన్నారు.